పండగ మూడు రోజులూ మాంసాహారం కోసం జిల్లా వాసులు భారీగా ఖర్చు చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రూ 3 కోట్ల మాంసాన్ని చక్కగా చప్పరించేశారు. వేకువజామున నాలుగు గంటల నుంచే మాంసం కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద క్యూ కట్టారు. వేల సంఖ్యలో కోళ్లు, గొర్రెల తలలు తెగిపడ్డాయి. ఒక్క నెల్లిమర్ల నగర పంచాయతీ విషయమే తీసుకుంటే..ఇక్కడున్న 50 మాంసం దుకాణాల ద్వారా భోగి నుంచి కనుమ వరకూ సుమారు పది లక్షల రూపాయల మాంసం విక్రయాలు జరిగాయి.
జిల్లా కేంద్రంలో అత్యధికంగా రూ.30 లక్షలపైనే మాంసం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు మటన్, చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినా జిల్లావాసులు ఎంతమాత్రం జంకలేదు. భోగీ, సంక్రాంతి నాడు కొంతమందే మాంసాహారం తీసుకున్నా, కనుమ రోజు దాదాపు అందరూ నోట ముక్క పెట్టారు. ప్రస్తుతం మటన్ ధర రూ.440 కాగా, చికెన్ ధర రూ 160గా ఉంది. మొన్నటిదాకా బాగా తక్కువగా ఉన్న చికెన్, మటన్ ధరలు పండగ రోజుల్లో అమాంతం పెరిగాయి. భోగికి ముందు వారం రోజుల నుంచి ధరలు చుక్కలను అంటాయి. అయినా సంక్రాంతి ప్రధాన పండగ కావడంతో జిల్లావాసులు మాంసం కొనుగోళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
భోగి మొదలుకొని కనుమ దాకా జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలోనే అత్యధికంగా మాంసం విక్రయాలు జరిగాయి. ప్రతి మున్సిపాలిటీలోనూ పది లక్షల రూపాయలకు తక్కువ గాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. అలాగే 34 మండల కేంద్రాల్లోనూ అధికంగా అమ్ముడుపోయింది. ఎక్కడా ఐదు లక్షలకు తక్కువకాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ పండగ సందర్భంగా మాంసం దుకాణాలు వెలిశాయి. ఒక్క కనుమనాడే భారీ సంఖ్యలో గొర్రెలు, కోళ్ల తలలు తెగిపడ్డాయి.
వేకువజామున నాలుగు గంటల నుంచే జిల్లా కేంద్రంలోనూ, మున్సిపాలిటీల్లోనూ, మండల కేంద్రాల్లోనూ మాంసం విక్రయాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల తర్వాత మాంసం దొరకలేదు. ముఖ్యంగా మటన్ ధర రూ 440కి పెరిగినా కొనుగోలు చేసేందుకు జిల్లావాసులు వెనుకాడలేదు. డిమాండ్ పెరగడంతో దుకాణదారులు అప్పటికప్పుడే ధరలను పెంచేశారు. నాటుకోడి ప్రియులకు ఈ ఏడాది ధరలు చుక్కలు చూపించాయి. మటన్‌తో సమానంగా నాటుకోడి ధరలు సైతం అమాంతం పెరిగాయి. కిలో నాటుకోడి మాంసం రూ.300 పైనే పలికింది.
ముక్కనుమ సందర్భంగా శుక్రవారం కూడా మాంసం విక్రయాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్త అల్లుళ్లు, దూరప్రాంతాల నుంచి విచ్చేసిన బంధువులున్న వారు శుక్రవారం కూడా భారీగానే కొనుగోలు చేస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా మాంసం విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది.