నో క్యాష్
Published Tue, Nov 22 2016 2:57 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
జిల్లా వాసులను నోట్ల కష్టాలు ఇప్పట్లో వీడేటట్లు లేవు. పెద్ద నోట్లు రద్దయి 14 రోజులు గడస్తున్నా ప్రజలు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నగదు మార్పిడి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల అవసరాలకు తగ్గట్టుగా ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడం సమస్యను మరింత జఠిలం చేసింది. ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో బ్యాంకు శాఖలు విఫలమయ్యాయి. దీంతో ఖాతాదారులు నగదు కోసం కష్టాలు పడాల్సివస్తోంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా విత్‌డ్రాను రూ.4వేలకు కుదించారు.
తిరుపతి (అలిపిరి):పెద్ద నోట్లు రద్దయి రెండు వారాలు గడుస్తున్నా జిల్లా ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరడం లేదు. ఆదివారం రోజున బ్యాంకులు సెలవు ప్రకటించడంతో సోమవారం రద్దీ పెరిగింది. నోటు మార్పిడికి, నగదు విత్‌డ్రాలకు అవస్థలుపడ్డారు. ఎస్‌బీఐ ప్రధాన శాఖలకు గంట ఆలస్యంగా నగదు చేరుకోవడంతో ప్రజలు ముందు పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకు బ్యాంకుల లావాదేవీలు ప్రారంభమయ్యారుు. జిల్లాలో 708 ఏటీఎం కేంద్రాలు ఉంటే కేవలం 20 శాతం మాత్రమే అరకొర సేవలు అందించారుు. ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉంచిన గంటలోపే ఖాళీ అవుతుండడంతో క్యూలో నిలుచున్న ఖాతాదారులు అసౌకర్యానికి లోనయ్యారు. పనిచేసిన కొన్ని ఏటీఎంలలో నగదు డ్రా చేస్తే రూ.2వేల నోటు వస్తుండడంతో ప్రజలు షాక్‌కు గురయ్యా రు. రూ.2వేల నోటు ఎలా మార్చాలో అర్థం కాక తలపట్టుకున్నారు. జిల్లాలోని 40 జాతీయ బ్యాంకు శాఖల్లో రూ.20 కోట్ల మేర నగదు మార్పిడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
విత్ డ్రా 4వేలకు పరిమితం
ఎస్‌బీఐ ప్రధాన శాఖలు విత్‌డ్రా పరిమితిని 4వేలకు కుదించాయి. ప్రజా అవసరాలకు తగ్గట్టుగా బ్యాంకుల్లో నగదు నిల్వలేకపోవడంతో బ్యాంకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకులకు పూర్తి స్థాయిలో నగదు అందే వరకు పూర్తి స్థాయి సేవలందించలేమని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చజెబుతున్నారు. ఖాతాదారులు చేసేది లేక అరకొర నగదు తీసుకుని వెనుదిరుగుతున్నారు.
జిల్లాకు మొండి చెయి..
జిల్లాలో నగదు మార్పిడి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని, అత్యవసరం నిమిత్తం రూ.1000 కోట్లు అవసరమని జిల్లా బ్యాంకు అధికారులు ఆర్బీఐకి విన్నవించారు. అధికారుల అభ్యర్థనలను ఆర్బీఐ కనీసం పట్టించుకోలేదు. ఆర్బీఐ సోమవారం జిల్లాలకు పంపిన అరకొర నిధులతో ప్రజలకు, ఖాతాదారులకు పూర్తి స్థారుులో సేవలు అందించలేక బ్యాంకు అధికారులు ఇబ్బందులు పడ్డారు.
ఏటీఎంల ముందు ‘నో క్యాష్’ బోర్డులు
తిరుపతిలో 6 ఏటీఎం కేంద్రాల వద్దకు వెళ్లా. ప్రతిచోటా నో క్యాష్ బోర్డులు పెట్టారు. ప్రరుువేట్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. డబ్బుకోసం ఉదయం నుంచి క్లాసుకు వెళ్లకుండా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా. ఆర్బీఐ స్పందించి ఏటీఎంలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. - శ్రీకాంత్, తిరుపతి
అవసరానికి నగదు ఇవ్వకుంటే ఎలా?
అత్యవసర పనులకు నగదు అవసరమైతే తిరుపతి ఎస్‌బీఐ ప్రధాన శాఖకు వచ్చా. వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది. అయితే నగదు కొరతంటూ బ్యాంకు అధికారులు విత్‌డ్రా పరిమితిని రూ.4వేలకు కుదించారు. అత్యవసరం నిమిత్తం కూడా నగదు డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వకుంటే ఎలా?
- బాషా, టైలర్, తిరుపతి
Advertisement
Advertisement