
మోక్షమెప్పుడో..?
– ముందుకుసాగని ఎన్టీఆర్ మార్గ్ పనులు
– కాలయాపన చేస్తున్న పాలకులు
అనంతపురం న్యూసిటీ : ఎన్టీఆర్ మార్గ్ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రోడ్డుకు మోక్షమెప్పుడు లభిస్తుందా అంటూ నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనంతపురం నగరంలో అత్యంత రద్దీగా ఉండే పాతూరు ట్రాఫిక్ సమస్యకు ఎన్టీఆర్ మార్గ్ ఏర్పాటుతో చెక్ పెట్టవచ్చు. అటువంటిది పాలకులు కాలయాపన చేస్తూ.. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి స్థల యజమానులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.25.04 కోట్లు విడుదల చేశారని ఎమ్మెల్యే, మేయర్ చెబుతున్నా అది మాటలకే పరిమితమైంది. బాధితులకు ఇంత వరకు చిల్లిగవ్వ దక్కకపోవడం గమనార్హం. దీంతో పాటుగా ఓ వైపు జలవనరులశాఖ చెరువుకట్ట నుంచి ముసలమ్మకట్ట వరకు డబుల్ లైన్ రోడ్డు వేస్తోంది. ఈ పనులు వేగవంతంగానే సాగుతున్నా ఎన్టీఆర్ మార్గ్ పనులు ముందుకు కదలడం లేదు. ఈ రెండు సకాలంలో పూర్తయితే నగర ప్రజలకు సగం ట్రాఫిక్ తలనొప్పి తగ్గినట్లే. ప్రధానంగా పాతూరు తిలక్‌రోడ్డును విస్తరణ చేయకుండా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన పనులు..
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతామని పాలకులు గత ఏడాది రూ.35 లక్షలతో చెరువుకట్ట కింద నుంచి శాంతినర్సింగ్ హోం వరకు ఎన్టీఆర్ మార్గ్ పేరుతో కిలోమీటర్ రోడ్డు వేసేందుకు శ్రీకారం చుట్టారు. తమ స్థలంలో రోడ్డు ఏవిధంగా వేస్తారంటూ నష్ట పరిహారం చెల్లించాలని 18 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో రోడ్డు ఏర్పాటు చేయకుండా కొంత మంది రాళ్లను అడ్డంగా వేశారు. దీంతో రోడ్డుకు బ్రేక్ పడింది. చివరకు కోర్టు కంటెమ్ట్ ఇవ్వడంతో నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు.
ఇటీవల ప్రభుత్వం రూ.25.04 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు జీఓ 312ను విడుదల చేసినా, ఎవరి స్థలం ఎంత ఉందని, వారికి ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది తదితర వాటిపై నగరపాలక సంస్థ అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. కాగా చెరువుకట్ట నుంచి ముసలమ్మ కట్ట వరకు డబుల్‌లైన్ రోడ్డు, చెరువుకట్ట కింద వైపు ఎన్టీఆర్ మార్గ్ నుంచి శాంతి నర్సింగ్ హోం వరకు పూర్తీ స్థాయిలో రోడ్డు అమలులోకి వస్తే తిలక్‌రోడ్డును టచ్ చేయాల్సిన పనిలేదని కొందరు అధికారులు, మేధావులు చెబుతున్నారు. తాడిపత్రి, గుత్తి నుంచి వచ్చే పెద్ద వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఈ మార్గాల ద్వారా దారి మళ్లించే సదుపాయం ఉంది. ఏదిఏమైనా ఈ రెండు మార్గాలు ఏర్పాటు జరిగితే నగరంలో ట్రాఫిక్ సమస్య ఉండదని తెలుస్తోంది. మరి పాలకులు ఎప్పుడు పూర్తి చేస్తారో లేదో వేచి చూడాలి.