పౌష్టికాహారం.. ఆరోగ్యప్రదాయం
రేపటినుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు
మాతా శిశు మరణాలను తగ్గించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1-7వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం...-ఘట్‌కేసర్ టౌన్
సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం. సమతుల ఆహారాన్ని భుజించిన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మన దేశంలో 50 శాతం మంది పిల్లలు పౌష్టికాçహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో వ్యా«ధి నిరోధక శక్తి తగ్గి శారీరక పెరుగుదల, చురుకుదనం మందగించే పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో 40 లక్షల మంది శిశువులు పుట్టిన 28 రోజుల్లో, 30 లక్షల మంది వారం రోజుల్లో మృత్యువాత పడుతున్నారు. దేశంలో వెయ్యికి 39 మంది చనిపోతుండగా రాష్ట్రంలో 40 నవజాత శిశు మరణాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం లోపు పిల్లలు 54 మంది చనిపోతుంటే అందులో నెల రోజులు నిండక ముందే 40 మంది పిల్లలు ప్రాణాలు విడుస్తున్నారు. 60-80 శాతం నవజాత శిశు మరణాలు తక్కువ బరువుతో జన్మించడం సంభవిస్తున్నాయని ఐసీడీఎస్ సర్వేలు చెబుతున్నాయి.
ఆహార ప్రాముఖ్యత...
పిల్లలు బలిష్టంగా, ఎత్తు, చురుగ్గా ఉండి పెరగడానికి పోషక విలువలున్న ఆçహారం ఎంతో ముఖ్యం. పోషకాహార లోపం ఉంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. పోషకాహారంలో సమపాళ్లలలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల చిన్నారుల పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడుతాయి.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..
చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది.
- కంటిచూపు మందగించకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా శిశువులకు విటమిన్ ఏ మాత్రలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యసిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు.
- బాలింతలు, గర్భిణులు, పిల్లలకు ఐరన్, ఫోలిక్‌ఆసిడ్ మాత్రలను అందిస్తున్నారు.
- 3-6 సంవత్సరాలలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు.
- విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు..
- శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ముర్రుపాలతో పిల్లల్లో పోషకాహార లోపం, శ్వాసకోశ వ్యాధులు, విరోచనాలు నివారించబడి శిశు మరణాలు తగ్గుతాయి.
- 6-12 నెలల వయస్సు పిల్లలకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని రోజుకు కనీసం మూడుసార్లు అందించాలి.
- 12 నెలల నుంచి 2 సంవత్సరాల వయస్సు పిల్లలకు కుటుంబం కోసం తయారు చేసే అన్ని ఆహార పదార్థాలను రోజుకు 5 సార్లు ఇవ్వాలి.
- పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు తల్లులు హాజరయ్యేలా చూడాలి.
- గర్భిణిలు, బాలింతల ఆహారంలో నిత్యం ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పాలు, మాంసకృతులు ఉండే విధంగా చూడాలి.