ఎటెళ్దాం!
-
నేడు విజయవాడలో మంత్రి రావెల సమావేశం
-
నెల్లూరులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ పర్యటన
-
మంత్రి, చైర్మన్ మధ్య నలిగపోతున్న అధికారులు
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మధ్య ఆధిపత్య పోరు ఆయా శాఖల అధికారులకు ఉద్యోగ సంకటంగా మారింది. ఇరువురు నేతలు అధికారులను తమ ప్రాబల్యానికి వాడుకుంటున్నారు. గురువారం మంత్రి రావెల విజయవాడలో నిర్వహించే సమావేశానికి రావాంటూ సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు అందాయి. అక్కడికి వెళ్దామనుకున్న సమయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం నెల్లూరుకు వస్తున్నట్లు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు రావడంతో ఎటెళ్లాలని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
నెల్లూరు (సెంట్రల్) :
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్‌లో జరిగే ప్రతి పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారికంగా జరిగే సమావేశాలకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, అటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను పిలిపించుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మంత్రి రావెలపై అసంతృప్తిగా ఉండటతో ఆయనకు వ్యతిరేక వర్గంగా ఉన్న కారెం శివాజీని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పదవిని కట్టబెట్టించారు. మంత్రి చేస్తున్న ప్రతి పనిలో కారెం వేలు పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి కూడా కారెంకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. దీంతో దళితుల్లో రెండు వర్గాలుగా విడిపోవాల్సి వచ్చినట్లు ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రి రావెల మాటను కూడా చైర్మన్ లెక్క చేయకపోవడం ఏమిటని పలువురు దళితులు ప్రశ్నిస్తున్నారు.
ఇబ్బందుల్లో అధికారులు
మంత్రి రావెల కిషోర్‌బాబు గురువారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రతి జిల్లా నుంచి సంబంధిత శాఖ అ«ధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశాలు ఉన్నాయి. కాని అదే సమయంలో జిల్లాలో కారెం శివాజీ పర్యటన ఉండటంతో ఆయన పర్యటనలో తప్పకుండా ఉండాలంటూ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాని అధికారులు ఏ పర్యటనకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
సెలవుపై వెళ్లేందుకు అధికారులు?
ఇరువురి నేతల మధ్య విభేదాల కారణంగా తమ జీవితాలతో ఆటలాడుకుంటున్న తీరును చూసిన పలువురు అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఽఇటీవల నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో కారెం శివాజీ సమావేశం అనంతరం పలువురు అధికారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. నేడు జరుగుతున్న సమావేశానికి పలువురు అధికారులు డుమ్మాకొట్టి సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.