మన్యంలో పని మైదానంలో ఏంపని..?
మన్యంలో పని మైదానంలో ఏంపని..?
Published Tue, Feb 14 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
పని చేసిన చోటే నివాస సూత్రం ఏమయిందో
ఆ సూత్రం చెప్పిన కలెక్టరే ఒత్తిడికి తలొగ్గితే ఎలా?
అతిపెద్ద మన్యంపై ఇదేనా శ్రద్ధ?
మండిపడుతున్న గిరిజనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘వడ్డించేవాడు మనవాడైతే జీతం ఒక చోట, ఉద్యోగం మరోచోట ఎంచక్కా చేసేయొచ్చు. మన్యం వాసుల ప్రయోజనాలను గాలికొదిలేసి మైదాన ప్రాంతంలో పనిచేస్తున్నా పాలకులుగానీ...సంబంధితాధికారులుగానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేరు. ఎందుకంటారా? ఆయనకున్న పలుకుబడి అటువంటిది మరి. ఏజెన్సీలో అధికారులంతా స్థానికంగానే నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ వైపు గట్టిగా నొక్కి చెబుతారు. దీనికి భిన్నంగా వేలాది మంది గిరిజనుల భూముల వివాదాలను పరిష్కరించే స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారికి కాకినాడలో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అక్కడలా...ఇక్కడిలా...ఇదేమి తీరంటూ గిరిజనులు మండిపడుతున్నారు.
మన్యవైపు కన్నెత్తి చూడకపోయినా...
రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసేందుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ మన్యం వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకు కారణం ఆయనకు జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడమే. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌ని మైదాన ప్రాంతంలో ఇ¯ŒSఛార్జి బాధ్యతలు అప్పగించడంపై మన్యం వాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన సంక్షేమం కోసం చాలా కీలకమైన పోస్టు స్పెషల్ డిప్యుటీ కలెక్టర్. గిరిజనులకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎస్‌డీసీపై ఉంది. ల్యాండ్ ట్రాన్సెక్షన్ రెగ్యులేటరీ పిటిషన్‌లను పరిష్కరించడం ఈయన ప్రధాన విధి.
మన్యంలో విధులు నిర్వర్తించాల్సిన ఆయన జిల్లా పంచాయతీ అధికారిగా కాకినాడలో పని చేస్తున్నారు. ఈ కారణంగా మన్యంలో పెద్ద ఎత్తున కేసులు పేరకుపోయి గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో ఆప్షనల్ సూట్ (ఒఎస్) కేసులు 153 ఎకరాలకు సంబంధించి 87, ల్యాండ్ ట్రాన్సేక్షన్ రెగ్యులేటరీ పిటీషన్‌లో 2,200 ఎకరాలకు సంబంధించి 409 కేసులు, మరో 352 ఎకరాలకు సంబంధించి 180 ఎల్‌టీఆర్‌పీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు రికార్డుల్లో నమోదైన వరకు మాత్రమే. ఈ కేసులే పరిష్కారం కాలేదు, ఇక కొత్తగా కేసులు వేసినా ప్రయోజనం ఉంటుందనే నమ్మకం లేక చాలా మంది గిరిజనులు పిటిషన్లు వేసేందుకు వెనుకాడుతున్నారు. లేదంటే కేసుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యేదంటున్నారు.
రాజకీయ నేతల్లా వ్యవహరిస్తే ఎలా...
ఇంత కాలం పాలకులు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదనుకునేవారు. ఇప్పుడు బాధ్యత కలిగిన అధికారులు కూడా పాలకుల బాటలో పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మన్యంలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎస్‌డీసీని కాకినాడలో నియమించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇ¯ŒSఛార్జిగా డీపీఓ పనిచేస్తున్న కుమార్ 2012 నవంబరు నుంచి 2015 మార్చి వరకు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎంగా కాకినాడలో పనిచేశారు. ఆ సమయంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఈ వ్యవహారంపై విచారణ నివేదిక జిల్లా యంత్రాంగం చేతికొచ్చే సమయానికి డీఎం కారణమేమిటో తెలియదు కానీ సెలవులో ఉన్నారు. ఎనిమిది నెలలు తిరగకుండానే 2015 నవంబరు 11న తిరిగి జిల్లా గిరిజన సంక్షేమ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్‌గా రంపచోడవరం వచ్చారు. మన్యంలో ఎస్‌డీసీగా పని చేస్తున్నప్పుడే కాకినాడలో సర్వశిక్ష అభియాన్ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారిగా 2016 మే 20 నుంచి నవంబరు ఒకటోతేదీ వరకు పనిచేశారు. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఆయన 2016 డిసెంబరు 17న జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే డీపీఓగా కొనసాగుతున్నారు. మన్యంలో కీలకమైన పోస్టింగులో పనిచేయాల్సిన కుమార్‌ను ఇక్కడ డీపీఓగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా కేంద్రం కాకినాడలో ఏ శాఖ అధికారికైనా బాధ్యతలు అప్పగించాల్సిందంటున్నారు. అలా కాకుండా గిరిజనుల ప్రయోజనాలను గాలికొదిలేసి మన్యంలో పనిచేయాల్సిన అధికారికి మైదాన ప్రాంతంలో బాధ్యతలు అప్పగించడమేమిటని గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఏజెన్సీలో అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని, అక్కడే పనిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మన్యంలో పనిచేయాల్సిన ఎస్‌డీసీకి ఇక్కడ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేమిటని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement