పాత కరెన్సీ కలకలం
పాత కరెన్సీ కలకలం
Published Wed, Jul 5 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
జాతీయ రహదారిపై తరలిస్తుండగా రూ.47.98 లక్షలు స్వాధీనం
నిందితులు ఉభయ గోదావరి జిల్లా వాసులు
రాజానగరం : నల్లధనాన్ని అరికట్టేందుకు, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులో రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల మార్పిడికి గడువు ముగిసిపోయింది. అంతేకాక ఈ నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే నేరంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించారు. అయినా నోట్ల మార్పిడికి అక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
జాతీయ రహదారిపై మోటారు బైకులపై తీసుకువెళ్తున్న రూ.47 లక్షల 98 వేల 500 పాత నోట్లను, నిందితులను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రద్దు అనంతరం మార్పిడికి గడువు ముగిసిన తరువాత ఈ నోట్లను కలిగి ఉండడం నేరంగా పరిగణించి వారిని అదుపులోకి తీసుకున్నామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషను వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ముందుగా అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తూర్పు మండల డీఎస్పీ కె. రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ సీఐ ఎం.ముక్తేశ్వర్రావులు తమ సిబ్బందితో జాతీయ రహదారిపై కలవచర్ల జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న సోదాల్లో ఈ నోట్లు పట్టుబడ్డాయి. ఎనిమిది మంది వ్యక్తులు నాలుగు మోటారు బైకులపై ప్రయాణిస్తూ కాకినాడ ఏడీబీ రోడ్డుకు మలుపు తిరుగుతున్న సమయంలో సోదా చేసేందుకు ప్రయత్నించగా పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని చుట్టముట్టి వారి వద్ద ఉన్న వస్తువులను తనిఖీ చేయడంతో పాత కరెన్సీ దొరికింది.
నిందితులు ఉభయ గోదావరి జిల్లాల వారే
ఈ ఘటనలో పట్టుబడిన నిందితులు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో ఏ–1గా ఉన్న కొప్పినీటి హరికృష్ణ (35) పాలకొల్లుకు చెందిన వాడు కాగా, ఏ–2 మేకా శాంతకుమార్ (39) కాకినాడకు చెందిన వారు. అలాగే మిగిలిన నిందితులు కోటేడి సతీష్‌కుమార్ (35) కరప మండలం, వేళంగికి చెందిన వాడు కాగా అంబటి రమేష్ (35), రాయపాటి బాలాజీ (31), పల్లా సత్తిరాజు (51), రాయుడు సత్యనారాయణ (47), గంటా వెంకటనరసింహరావులు రాజమహేంద్రవరానికి చెందిన వారు. వీరు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు బైకులతోపాటు వారి వద్ద ఉన్న తొమ్మిది సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ తెలిపారు.
ఆరా తీస్తున్నాం
ప్రభుత్వం, రిజర్వు బ్యాంకులు రద్దు చేసిన కరెన్సీ నోట్లను వీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అసలు ఈ సొమ్ములు వీరికి ఎలావచ్చాయి? వీటిని ఏవిధంగా మారుస్తారు? ఇప్పటికి ఇలా ఎంత కాలం నుంచి చేస్తున్నారు? అసలు వీటికి ఐటీ లెక్కలు ఉన్నాయా? అనే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. రద్దు చేసిన నోట్లను కలిగివుండటమే ఒక నేరం అయితే వాటిని మార్చేందుకు వేరొకచోటకు తరలించే ప్రయత్నం చేయడం కూడా నేరమే అవుతుందన్నారు.
Advertisement
Advertisement