నాడు కుటీరం.. నేడు వీఐపీల గెస్ట్‌హౌస్
గుంతకల్లు : క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణలో ఉన్న రైల్వే అధికారులు తాత్కాలికంగా సేద తీరడం కోసం నిర్మించిన ఓ కుటీరం కాలక్రమేణా ‘కోసి’ గెస్ట్‌హౌస్‌గా రూపాంతరం చెందింది. 1980లో అప్పటి డీఈఎన్ గోపాలక్రిష్ణ, ఐఓడబ్ల్యూ దొరైస్వామిల హయాంలో గుంతకల్లు రైల్వే జంక‌్షన్ సమీపంలో రేకులతో చిన్నపాటి హాల్ నిర్మించారు. కిందిస్థాయి రైల్వే అధికారులకే కాకుండా ఉన్నతాధికారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అనంతర కాలంలో భావించారు. దానికి మరిన్ని హంగులు అద్దాలనుకున్నారు. సుమారు రెండు ఎకరాల భూమిలో విశాలంగా గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ గెస్ట్‌హౌస్ ముందు భాగాన 10 గదులతో కూడిన ఏసీ రూమ్‌లు, ఒక నాన్ ఏసీ గదిని నిర్మించారు.
మిగిలిన ఎకరం స్థలంలో గెస్ట్‌హౌస్ అందాలను ద్విగుణీకృతమయ్యేలా రకరకాల పూల మొక్కలు, షో మొక్కలు నాటారు. విశ్రాంతి గృహం ముందు భాగంలో మట్టి కడవతో ఆహ్వానిస్తున్నట్లు ఉన్న అందమైన నర్తకి బొమ్మను ఏర్పాటు చేశారు. ముందుభాగంలో ఫౌంటెన్ నిర్మించి దాని చుట్టూ రంగు రంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో వేసిన పచ్చని గడ్డి ఇక్కడకు విచ్చేసిన వీఐపీలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం పంచుతోంది. గుంతకల్లు రైల్వే కోసీ గెస్ట్‌హౌస్‌కు ప్రత్యేక స్థానం కల్పించేందుకు 2010లో అప్పటి డీఆర్‌ఎం సందీప్‌కుమార్‌జైన్ లక్షలాది రూపాయలు వెచ్చించి విశ్రాంతి గృహం రూపురేఖలు మార్చారు. ఈ గెస్ట్‌హౌస్‌లో బస చేయాలంటే డీఆర్‌ఎం లేదా సంబంధిత శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి.
- గుంతకల్లు