
గెలుపొందిన క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు
- మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత
కొత్తగూడెం అర్బన్ : ఒలింపిక్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని శిక్షణ పొందాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత సూచించారు. ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్ సౌజన్యంతో జిల్లా సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు స్థానిక ప్రకాశం స్టేడియంలో శుక్రవారం జరిగాయి. కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా నలుమూలాల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులున్నారని, రానున్న కాలంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు కొత్తగూడెంలో నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ మాట్లాడుతూ జిల్లా మీట్‌లో ప్రతిభ ఆధారంగా ఆగస్టు నెలలో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు.
ఈ చాంపియన్‌షిప్‌కు జిల్లా నలుమూలల నుంచి 1,700 మంది పాల్గొన్నారని, 80 అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహించామని చెప్పారు. కాగా, షాట్‌పుట్‌లో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న వారు ప్రతాప్, అఖిలేష్, రాజారెడ్డి, బాలికల విభాగంలో లేఖన, అర్చిత, విజ్ఞేశ్వరి ఉన్నారు. 600 మీటర్ల రన్నింగ్‌లో సూర్య, వినోద్, సుమంత్, బాలికల విభాగంలో మిథిలా, కృపావతి, పూజిత గెలుపొందారు. 100 మీటర్ల రన్నింగ్ పోటీలో సాయివంశీ, చరణ్, సాయిలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జివికె.మనోహర్, గౌతమ్ మోడల్ స్కూల్ చైర్మన్ దోసపాటి కార్తీక్, స్కూల్ డీన్ ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ గుండేటి లక్ష్మీనారాయణ, ఏఓ నాగరత్నం, ఇన్‌చార్జ్ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ది మీట్ శివకుమార్, కన్వీనర్ తరుణ్, పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి మల్లేష్, జిల్లా హాకీ కార్యదర్శి ఇమామ్, జిల్లా అథ్లెటిక్స్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, టెక్నికల్ అఫిషియల్స్ పాల్గొన్నారు.