కుమారుడి పెళ్లి వేడుకలు ముగించుకుని తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడి తల్లి ప్రాణాలు కోల్పోయింది.
కొత్తకోట (మహబూబ్‌నగర్) : కుమారుడి పెళ్లి వేడుకలు ముగించుకుని తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడి తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రితోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నాటెళ్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గద్వాల పట్టణం రెవెన్యూ కాలనీకి చెందిన చంద్రశేఖర్, పుష్పవతమ్మ (60) దంపతుల కుమారుడి వివాహం శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగింది.
పెళ్లి వేడుక ముగిసిన తర్వాత చంద్రశేఖర్ దంపతులు, మరికొందరు స్విఫ్ట్ డిజైర్ కారులో గద్వాలకు బయల్దేరారు. నాటెళ్లి వద్దకు వచ్చేసరికి కారు టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన పుష్పవతమ్మ ప్రమాద స్థలంలోనే కన్నుమూసింది. చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, వీరభద్రమ్మ, జ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బాధితులను కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.