విద్యుదాఘాతానికి యువకుడి మృతి
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
Published Thu, Oct 27 2016 1:37 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
వరికుంటపాడు : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని విరువూరులో ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని కృష్ణంరాజుపల్లికి చెందిన డి.వెంకటనారాయణ (30) విరువూరులోని వాటర్ ప్లాంట్‌లో పనిచేసే తన సమీప బంధువు దగ్గరకు మంగళవారం ఉదయం వెళ్లాడు. అక్కడ సెల్‌చార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఉదయం జరిగినప్పటికీ రాత్రి బాగా పొద్దుపోయే వరకు బయటకు పొక్కలేదు. రాత్రికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ ముత్యాలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బుధవారం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
మృతిపై అనుమానాలు
వెంకటనారాయణ మృతిపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షాక్‌తో మృతి చెందలేదని, ఉద్దేశ పూర్వకంగా చంపి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ షాక్ అయితే తగిలిన ప్రాంతంలోనే గాయాలు ఉండాలి తప్ప తలపై బలమైన గాయం ఉండటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై కూడా కొన్నిచోట్ల కొట్టిన దెబ్బలున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సాక్షి ఎస్‌ఐ ముత్యాలరాజు దృష్టికి తీసుకురాగా విద్యుదాఘాతంతోనే మృతి చెందాడని తెలిపారు. అనుమానించాల్సిన అంశం ఏమీ మా దృష్టికి రాలేదన్నారు. తొలుత పోస్టుమార్టం వద్దని బంధువులు చెప్పినప్పటికీ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున పోస్టుమార్టం నిర్వహించామని తెలిపారు.
Advertisement
Advertisement