పుష్కర తొక్కిసలాటపై నేడు బహిరంగ విచారణ
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆధారాల పరిశీలన
ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు
నెలాఖరుతో ముగియనున్న కమిషన్ కడువు
రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది జూలై 14వ తేదీన జరిగిన తొక్కిసలాటపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీవై సోమయాజులు ఏక సభ్య కమిషన్ మంగళవారం మరోసారి బహిరంగ విచారణ చేపట్టనుంది. పుష్కర తొక్కిసలాటలో 29 మృతి చెందగా 52 మంది వరకూ గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ గడువు గత మార్చి 29తో ముగియగా మరో మూడు నెలలు గడువు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ పెంచిన గడువు కూడా ఈ నెల 29తో ముగిసిపోతోంది.
ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని ఈ విషయంలో విచారించలేదు. ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ను విచారించాలని ఆఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. అయితే ఆధారాలు చూపిస్తే విచారించేందుకు అవకాశం ఉందో? లేదో ? పరిశీలిస్తామని గతంలో జస్టిస్ సోమయజులు స్పష్టం చేశారు.
ఆ నేపథ్యంలో మంగళవారం న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సమర్పించిన వీడియో క్లిపింగ్‌లు, ఇతర ఆధారాలను రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోమయాజులు పరిశీలిస్తారు. ఈ ఆధారాలను ఆయన పరిశీలించిన తరువాతైనా ఈ కేసులో రెండు రకాలుగా నివేదికలు ఇచ్చిన కలెక్టర్‌ను విచారిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది.