
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్!
డాక్టర్ నుంచి మంత్రి వరకు అదే భాష్యం
ఈఎన్‌టీ ఆస్పత్రిలో బాలుడి మృతి వ్యవహారం
కేసు నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నం
విశాఖపట్నం : ఆపరేషన్ సక్సెస్.. బట్ పేషెంట్ డెడ్! అన్నట్టుగా ఉంది వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రుల తీరు. ఆపరేషన్ సక్సెస్ అంటే రోగి ప్రాణాలతో బయటపడడం. కానీ విశాఖలోని ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు, వైద్యారోగ్యశాఖ అమాత్యుడు సరికొత్త భాష్యం చెబుతున్నారు. రోగి చనిపోయినా శస్త్రచికిత్స విజయవంతం అయినట్టే! వైద్యుడు ఆపరేషన్ బాగానే చేసినా మత్తు మోతాదు లోపం వల్ల మరణించడం తమకు సంబంధం లేదన్నట్టు తేల్చేస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మూడేళ్ల జయశ్రీకర్ అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం ఇదే తరహాలో మరో బాలుడు కూడా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి మృత్యువాత పడ్డాడు. ఇలా చిన్నారులు వరుసగా చనిపోతుంటే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, లోపాలను సరిచేయకుండా సమర్థిస్తూ ప్రకటనలివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల క్రితం ఓ చిన్నారి మరణించినప్పుడే ఉన్నతాధికారులు గాని, మంత్రి గాని సీరియస్‌గా స్పందించి ఉంటే నాలుగు రోజుల క్రితం ఘటన పునరావృతం అయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనపై మిన్నకుండి పోవడం వల్లే జయశ్రీకర్ శస్త్రచికిత్సలో బాధ్యతారాహిత్యం మరోసారి చోటుచేసుకుందని అంటున్నారు.
బాధ్యులను వెనకేసుకొచ్చిన మంత్రి
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి జయశ్రీకర్ మృత్యువాత పడిన ఘటనను ‘సాక్షి’లో ప్రముఖంగా ప్రచురించడంతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించి విచారణకు వైద్యుల బృందంతో ఒక కమిటీని వేశారు. మరోవైపు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈఎన్‌టీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులతో బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. బాలుడి ఆపరేషన్ సక్సెస్ అయిందని, కానీ గుండె పనిచేయకపోవడం (కార్డియాక్ అరెస్ట్)తో చనిపోయాడని బాధ్యులైన వైద్యులను వెనకేసుకొచ్చారు. శస్త్రచికిత్స కోసం మత్తు మందు ఇచ్చిన వైద్యుని పనితీరుపై పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల తీరు మారకపోతే రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పాటైన కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్ రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇకపై ఈ శస్త్రచికిత్స వికటించి ఒక్క మరణం కూడా సంభవించరాదని స్పష్టం చేశారు. మంత్రి స్పందన చూసిన వారు బాలుడి మృతి కేసును నీరుగార్చడానికేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలావుండగా ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథబాబు ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న పరీక్షలకు ఎగ్జామినర్‌గా నియమితులు కావడంతో అక్కడకు వెళ్లారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలను బాలుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన కృష్ణకిశోర్‌కు అప్పగించారు.
బాలుడి మృతిపై మంత్రి కామినేని ఆరా
పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : ఈఎన్‌టీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తరువాత బాలుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆరా తీశారు. శనివారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి బాలుడి మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా ఇక్కడి ఈఎన్‌టీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్ కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిలో 13 వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిర్వహించారన్నారు. దురదృష్టవశాత్తు మూడు రోజుల క్రితం ఓ బాలుడు సర్జరీ అయిన తరువాత మృతి చెందారన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఈ ఆస్పత్రిలో మరిన్ని సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. మరో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిపై ఆడియో గ్రాఫర్, నర్సర్లు, ఇతర ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి కావాల్సిన ఇతర సదుపాయాల కల్పనకు సుమారు రూ.2 కోట్లను వెచ్చిస్తామని వెల్లడించారు.