ఓరుగల్లు తీర్పు నేడే
సాక్షి, హైదరాబాద్, హన్మకొండ అర్బన్: ‘ఓరుగల్లు’ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్.. ఏ పార్టీ భవిష్యత్ ఏమిటో తేల్చేయనుంది. పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రతి పోలింగ్ బూత్‌లో ఉదయం తొలి ఓటు వేసే వారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికేందుకు అధికారులు సిద్ధమయ్యూరు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,57,231 పురుషులు, 7,52,293 స్త్రీలు, 147 మంది ఇతరులు ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, వామపక్ష కూటమిపాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,778 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది.
8,900 మంది పీవో, ఏపీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్‌లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు వెబ్ కాస్టింగ్ కోసం 800 మంది బీటెక్ విద్యార్థులను ప్రత్యేకంగా నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 819 అత్యంత సమస్యాత్మక, 393 సమస్యాత్మక, 566 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మొత్తంగా 7,606 మంది పోలీసులను రంగంలోకి దింపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కోసం 20 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. నామినేషన్ల నాటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా బృందాలు కోడ్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారుు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ. 1.88 కోట్ల నగదును సీజ్ చేశారు. ఎన్నికల టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 25 ఫిర్యాదులు అందాయి. పోటీలో జిల్లాలో గత పది రోజుల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి.
సర్వత్రా ఉత్కంఠ!
తమ 17 నెలల పనితీరుకు వరంగల్ ఫలితం అద్దం పడుతుందని అధికార పక్షం భరోసాతో ఉంది. తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. దాదాపు రాష్ట్ర మంత్రులంతా పది రోజుల పాటు వరంగల్‌లోనే మకాం వేశారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. రెండు లక్షలపైన మెజారిటీతో విజయం సాధించాలన్న లక్ష్యంతో గులాబీ నాయకత్వం పనిచేసింది. ఇక ఎలాగైనా గెలిచి సత్తా చాటుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ... ఉప ఎన్నికల్లో గెలుపు అంచునకు వచ్చామన్న ధీమాతో ఉంది. ప్రచారం ముగిసిన వెంటనే... పోలింగ్ నాడు పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంది. హైదరాబాద్ నుంచి సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
తగిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు గాంధీభవన్‌లో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వరంగల్‌లో గెలిస్తే తమ అభ్యర్థి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం చేయడం ద్వారా బీజేపీ విద్యావంతుల్లో పట్టు సంపాదించే ప్రయత్నం చేసింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందిన పేదలు, దిగువ మధ్య తరగతి, మైనారిటీల సానుభూతి తమకు ఉపకరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. వైఎస్సార్‌సీపీ తరఫున ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జగన్ సభలకు పెద్ద ఎత్తున జనాదరణ రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.