ఇస్లాం మతంలో ఎవరి అభిమతం చెల్లదు
– మౌల్వీలు, మతపెద్దలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇస్లాం మతంలో ఎవరి అభిమతం చెల్లదని బెంగుళూరుకు చెందిన మౌలానా పి.ఎం.ముజమ్మిల్ పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్‌లా బోర్డుకు సంబంధించిన అంశంపై స్థానిక ఉమర్ అరబిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం మౌల్వీలు, మతపెద్దలు నిర్వహించిన ఈ కార్యక్రమం గురువారం రాత్రి 2.00 గంటల దాకా కొనసాగింది. కార్యక్రమానికి మౌలానా ముజమ్మిల్‌తో పాటు హైదరాబాదుకు చెందిన మౌలానా సయ్యద్ జహంగీర్, ముఫ్తి సయ్యద్‌షా ఆరిఫ్‌పాషా ఖాద్రి, మౌలానా జుబేర్‌అహ్మద్ ఖాన్, మన్సూర్ అహ్మద్ సల్ఫి, మౌలానా అబ్దుల్లా ఖాస్మి, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాంలో మహిళలకు సముచిత గౌరవముందని, 2011 సర్వే ప్రకారం విడాకులు పొందిన వారి సంఖ్య విషయంలో ఇస్లాం మతం 6వ స్థానంలో ఉందన్నారు. మౌలానా జహంగీర్ మాట్లాడుతూ ఇస్లాంలో ఎవరి అభిమతానికి తావులేదని, ప్రపంచంలోని ముస్లింలందరు ఖురాన్, హదీసు వెలుగులో జీవనం సాగిస్తున్నారన్నారు. ముఫ్తి ఆరిఫ్ పాషా ఖాద్రి మాట్లాడుతూ ఇస్లాంలో మార్పులు–చేర్పులు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.