కర్ణాటక ప్రాంత ప్రజలు జలచౌర్యానికి పాల్పడుతుండటంతో తుంగభద్ర ఎగువకాలువ(హెచ్చెల్సీ)పై ఆధారపడిన అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు బళ్లారి జిల్లా కలెక్టర్ రాంప్రసాద్ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు.
- 300 క్యూసెక్కుల చొప్పున జలచౌర్యం
- బళ్లారి కలెక్టర్‌కు హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు ఫిర్యాదు
అనంతపురం సెంట్రల్ :
కర్ణాటక ప్రాంత ప్రజలు జలచౌర్యానికి పాల్పడుతుండటంతో తుంగభద్ర ఎగువకాలువ(హెచ్చెల్సీ)పై ఆధారపడిన అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు బళ్లారి జిల్లా కలెక్టర్ రాంప్రసాద్ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ శశిభూషణ్‌రావుతో కలిసి బళ్లారిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలోకి నీరు రాకపోవడంతో ఈ ఏడాది హెచ్చెల్సీ రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ నీటిపై ఆధారపడిన రైతులు హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ కాలువల కింద పంటలు సాగు చేశారని, కరువు జిల్లాలో తాగునీటి అవసరాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కానీ హెచ్చెల్సీకి ఈ ఏడాది కేవలం 10 టీఎంసీలు మాత్రమే కేటాయించారన్నారు. నికరంగా 32 టీఎంసీలు రావాల్సిన చోట కేవలం 10 టీఎంసీలే వస్తున్నందున జిల్లాలో నీటి అసవరాలు అధికంగా ఉన్నాయన్నారు. కొద్దిరోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నారన్నారు. అనంతపురం కోటా వచ్చిన సమయంలో హెచ్చెల్సీకి 1,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని బోర్డు అధికారులు చెబుతున్నా జిల్లాకు 1,000 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. 100 కిలోమీటర్ల మేర హెచ్చెల్సీ కర్ణాటకలో ప్రవహిస్తుండటంతో కాలువ వెంబడి దాదాపు 300 క్యూసెక్కులు అక్రమంగా తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీనివల్ల అనంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జలచౌర్యాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. హెచ్చెల్సీ కోటా మొత్తం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, అదనపు బలగాలు ఏర్పాటు చేసి నీటి పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని ఎస్‌ఈ తెలిపారు.