
మాది రైతు ప్రభుత్వం
రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడుతూ.. రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేస్తున్న తమది రైతు ప్రభుత్వమని....
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ : రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడుతూ.. రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేస్తున్న తమది రైతు ప్రభుత్వమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్‌లోని మార్కెట్ యార్డులో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డితోపాటు వైస్‌చైర్మన్, డెరైక్టర్లు మంత్రి సమక్షంలో లాంఛనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రామచంద్రారెడ్డికి శాలువా క ప్పి మంత్రి అభినందించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు స్వయంసమృద్ధి సాధించాలని కోరారు. గ్రామాల్లో నాయకులు వాణిజ్య పంటలను సాగుచేసి, రైతులకు వాటిని పరిచయం చేయాలని సూచించారు.
తెలంగాణ వచ్చాక ఒక్కో నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై త్వరలోనే పుస్తకాలు రూపొందించి అందరికీ తెలియజేస్తామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి 20 ల క్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు.
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టపడుతుంటే.. సిగ్గులేకుండా కొందరు పనికి మాలిన వాళ్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ డెరైక్టర్లు తదితరులు పాల్గొన్నారు.