పదేళ్లయినా పూర్తి కాలేదు | Happen ten years but not completed | Sakshi
Sakshi News home page

పదేళ్లయినా పూర్తి కాలేదు

Published Mon, Jan 9 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

పదేళ్లయినా పూర్తి కాలేదు

పదేళ్లయినా పూర్తి కాలేదు

రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లైనా ఇంకా సాగుతూనే ఉంది.

నత్తనడకన పునరావాసం పనులు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లైనా ఇంకా సాగుతూనే ఉంది. ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తించిన మిడ్‌మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్యాకేజీలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని కృత నిశ్చయంతో ఉన్నా ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. మొత్తంగా 12 ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే 85 గ్రామాలను ఖాళీ చేయించి నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమం పూర్తిచేసి వచ్చే జూన్‌ కల్లా ఆయకట్టుకు నీరందిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం నిధుల కేటాయింపే కాకుండా నిర్వాసితులకు పట్టాల పంపిణీ మొదలుకొని గృహ వసతి కల్పన వరకు చేపట్టాల్సిన పనులను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయకుంటే ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం కష్టతరమే. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస పనుల్లో వేగానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

ఎప్పటిలోగా పూర్తవుతుంది?
2004లో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్‌2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కుమ్రంభీమ్, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద 67 గ్రామాలు పూర్తిగా, 18 పాక్షికంగా .. మొత్తంగా 85 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలకు చెందిన 44,094 మంది నిర్వాసితులు అవుతున్నారు. పునరావాస చట్టాల మేరకు వీరందరికీ గృహాలను నిర్మించి, రోడ్లు, నీరు, కరెంట్‌ కనెక్షన్‌ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే ఇప్పటివరకు 85 ముంపు గ్రామాలకు గానూ 72 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే(ఎస్‌ఈఎస్‌) పూర్తయింది. 75 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటివరకు ప్రతిపాదనలు చేయగా, ఇందులో 73 గ్రామాల కోసం భూమిని సేకరించారు. మొత్తం 44వేల మందిలో కేవలం 17,137 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 12,117 నివాస గృహాలను పూర్తి చేశారు. మరో 21,796 గృహాలను పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.400 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ ఇదే సమస్య..
జూన్‌ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో భీమా ఒకటి. ఈ ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించిన ప్రభుత్వం ఇందులో ఇప్పటివరకు 2,861 మందికి మాత్రమే పట్టాలు పంపిణీ పూర్తిచేసింది. మౌలిక వసతుల కల్పన పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్‌గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో ఇంతవరకు నిర్వాసితులకు పట్టాల పంపిణీ జరగనే లేదు. సహాయ, పునరావాసానికి మొత్తంగా రూ.92.34 కోట్ల మేర నిధులు  అవసరం ఉండగా ఇప్పటివరకు రూ.48.33 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారు.

ఇక మరో ప్రాధాన్య ప్రాజెక్టుగా ఉన్న నెట్టెంపాడు కింద మూడు ముంపు గ్రామాలు ఉండగా 2,640 మంది నిర్వాసితులకు గానూ 1,824 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది. ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్‌పాడ్‌ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి లెవలింగ్, రోడ్, వాటర్, విద్యుత్‌ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. ఇక్కడ సహాయ, పునరావాసానికి ఇంతవరకు రూ.68.31 కోట్ల మేర అవసరం ఉండగా రూ.19.33 కోట్ల మేర ఖర్చు చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులకు గత ప్రభుత్వాలు అంత ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 18 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మొత్తంగా 11,123 మంది నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం ఇందులో ఆర్‌ఆర్‌ కింద ఇప్పటివరకు కేవలం 5,800 మందికి మాత్రమే పట్టాలను అందించింది. మరో 6వేల మందికి ఈ ఏడాది చివరిలోగా పట్టాలు అందించి, వారికి కొత్తగా గృహ సముదాయాల ఏర్పాటుకు తగినన్ని నిధులు వెచ్చించాల్సి ఉంది. పట్టాలు, గృహ నిర్మాణాల అవసరాలకు మొత్తంగా రూ.325కోట్ల వరకు అవసరం అవుతుందని లెక్కలు కట్టగా ఇప్పటివరకు రూ.200కోట్లు ఖర్చు చేశారు. ఇలా మిగతా ప్రాజెక్టుల్లో కలిపి చూసుకుంటే మరో రూ.400కోట్ల వరకు వెచ్చిస్తేనే పునరావాస ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్వాసితుల కొత్త కాలనీల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పునరావాస కార్యక్రమం వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement