తెరపైకి ఔటర్ రింగ్ రోడ్డు
♦ రెండో దశకింద వచ్చే ఏడాదిలో పనులు
♦ జాతీయ రహదారికి అనుసంధానం
♦ గతంలోనే ప్రకటించిన సీఎం కేసీఆర్
♦ రూపుదిద్దుకుంటున్న మాస్టర్ ప్లాన్
నిజామాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి తెరపైకి వచ్చింది. రెండో దశ కింద వచ్చే ఏడాది రింగ్ రోడ్డు పనులు రూపుదిద్దుకోనున్నాయి. మున్సిపల్ అధికారులు ప్రణాళికను ఏడాది కిందటే అందజేయగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు.
నిజామాబాద్‌అర్బన్ : నిజామాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలోని గజ్వెల్, వరంగల్, ఖమ్మం జిల్లాలో రింగ్ రోడ్ల పనులు ఈ ఏడాది చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండో దశ కింద కరీంనగర్, నిజామాబాద్‌లో వచ్చే ఏడాది రింగ్ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇదివరకే ఈ నిర్మాణాలకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ అధికారులు ప్రణాళికను ఏడాది కిందటే ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరానికి ఇదివరకే బైపాస్ రోడ్డుతో కాస్త ఉపశమనంగా ఉండగా రింగ్‌రోడ్డు నిర్మాణంతో మరింత సౌకర్యం కలుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. నిజామాబాద్ నగరంలో 3.20 లక్షల జనాభా ఉండగా 50 డివిజన్లు ఉన్నాయి.
సుమారు 1,100 కాలనీలు ఉన్నాయి. రోజురోజుకూ నగర శివారు ప్రాంతాల్లో నివాస గృహాలు వేగవంతంగా పెరుగుతున్నాయి. పట్టణం విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక ఔటర్‌రింగ్‌రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 2014లో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో సైతం జిల్లాకు తక్షణమే రింగ్‌రోడ్డు అవసరమని దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి డిచ్‌పల్లివైపు నుంచి వెళ్తుండడం, జిల్లా కేంద్రానికి అనుసంధానం లేకపోవడం ఏమిటని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాకాకుండా పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని ఆ నాడు సమావేశంలో హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అర్బన్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మిస్తామని సీఎం ప్రకటించడంలో ఆశలు రెకెత్తిస్తున్నాయి.
రింగ్‌రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరనుంది. ప్రస్తుతం బైపాస్ రోడ్డు అందుబాటులో ఉన్నా రోడ్డు పూర్తికాకపోగా, అర్సపల్లి వద్ద అసౌకర్యం ఉండడంతో భారీ వాహనాలు సైతం కొన్ని నగరం గుండా వెళుతున్నాయి. కంఠేశ్వర్ వైపు బైపాస్ రోడ్డు ఉన్నా వినాయక్‌నగర్, నాగారం వైపు ప్రత్యామ్నాయ రోడ్డు అందుబాటులో లేదు. రింగ్‌రోడ్డు ఏర్పడితే నగరం చుట్టూ శివారు ప్రాంతాల గుండా అన్ని ప్రాంతాలకు సౌకర్య వంతంగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది. నగరంలోని అర్సపల్లి, బోధన్ రోడ్డు వైపు శివారు ప్రాంతం, ఆర్మూర్ రోడ్డు వైపు ఆర్టీసీ కాలనీ, ముబారక్‌నగర్ కాలనీ వైపు రద్దీగా ఉంటుంది. నాగారంలోని ఆర్‌టీఏ ఆఫీసు వరకు, వినాయక్‌నగర్‌లోని బోర్గాం వరకు నగరం విస్తరించింది. ఈ ప్రాంతాల గుండా రింగ్‌రోడ్డును నిర్మిస్తూ జాతీయ రహదారికి అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఇదివరకే వినాయక్‌నగర్‌లో బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది.
దీనిని ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా అధికారులు ఏమి చేయాలన్నది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే పట్టణ జనాభాను ప్రాంతాలను పరిశీలించి ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. మొదట పరిశీలన చేసి రింగ్ రోడ్డు నిర్మాణంపై తుది నివేదికను తయారు చేస్తారు. ఈప్రక్రియ చేపట్టాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. ఏడాదిలోపు ఈ ప్రక్రియను చేపట్టి పనుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. మున్సిపాల్ కార్పొరేషన్ నగరానికి కొత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ఇదివరకే ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ఇందులోనే ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు ఉండనున్నాయి. వీటిని కూడా అధికారులు పరిశీలించనున్నారు. మాస్టర్ ప్లాన్ నివేదికను బేసిక్‌గా చేసుకొని ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం ఉంటుందని అధికాారులు పేర్కొంటున్నారు.