గ్రామపంచాయతీలకు సొంత భవనాలు
గ్రామపంచాయతీలకు సొంత భవనాలు
Published Wed, Aug 31 2016 8:42 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు సిటీ : జిల్లాలో సొంత భవనాలు లేని 101 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పంచాయితీరాజ్ ద్వారా చేపట్టిన పనుల ప్రగతిని బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో స్వంత భవనాలు లేని గ్రామ పంచాయతీ కార్యాలయాలు 101గా గుర్తించడం జరిగిందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, 14వ ఆర్థిక కమిషన్ నిధులతో నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని, డ్వామా పీడీని కలెక్టరు ఆదేశించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
పనుల పట్ల అశ్రద్ధ చూపితే కఠిన చర్యలు :
పరిపాలనా ఆమోదం పొంది టెండర్లు పిలవడానికి 6 నెలలా? టెండర్లు పూర్తయిన తరువాత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు మరో 6 నెలలా? విధులు నిర్వర్తించడంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్లపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు ఫైనలైజ్ అయిన 48 గంటల్లో కాంట్రాక్టర్లలో ఇంత నిర్లప్తత నెలకొనడంపై కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. పెదపాడు మండలంలో ఫిబ్రవరి నెలలో రూ. 10 లక్షల ఖర్చుతో నిర్మించే భవనానికి గత ఫిబ్రవరిలో పరిపాలనా ఆమోదం మంజూరు చేసినప్పటికీ ఇంతవరకూ కనీసం టెండర్లు ఎందుకు పిలవలేదని, అదే పెదవేగి మండలంలో వ్యవసాయ శాఖ భవనం నిర్మాణాలకు ఫిబ్రవరి నెలలో టెండర్లు ఫైనలైజ్ అయినప్పటికీ ఇంతవరకు కాంట్రాక్టరుకు పనులు అప్పగించడం లో ఇంత జాప్యం ఎందుకు జరిగిందని కలెక్టరు సూపరింటెండింగ్ ఇంజనీరును ప్రశ్నించారు. మంజూరైన పనులలో ఒక పెద్ద పనిని వివిధ భాగాలుగా చేసి నామినేషన్‌పై అప్పగించడం 4 లేదా 5 పనులను మొత్తంగా ప్యాకేజీగా ఒక కాంట్రాక్టర్ అప్పగించవద్దన్నారు. సమావేశంలో సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ.మాణిక్యం, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి టీ.సురేష్‌కుమార్, డ్వామా పీడీ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ జీ.చంద్రశేఖర్, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రకాష్‌నాయుడు, రఘుబాబు, కెసీ రామన్న, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Advertisement