మాయల మరాఠీలు
► ఏఈ నుంచి సీఈ దాకా ఇక్కడే ప్రస్థానం
► మిత్ర చతుష్టయంతో అంతులేని అక్రమార్జన
► హద్దులు దాటిన కేజీహెచ్ వైద్యుని సంపాదన
► కలకలం రేపిన ఏసీబీ దాడులు
పాండురంగారావు.. ఈ పేరు వింటే ఇప్పటికీ విశాఖ వాసుల్లో చాలామందికి ఠక్కున గుర్తుకొస్తారు.. జీవీఎంసీ ఇంజినీరని. ఆయన ప్రజల్లో అంతగా మమేకమై పోయారని కాదు.. అవినీతి, అక్రమ సంపాదనల్లో ఆరితేరిపోయారని..! అడ్డదారుల్లో వచ్చిన ఆదాయంతో బహుళ అంతస్తుల భవనాలు కట్టారు. తోచిన చోటల్లా పెట్టుబడులు పెట్టారు. ఆస్తులను బినామీల పేరున దాచిపెట్టారు. అందుకు కొందరు నమ్మకమైన మిత్రులతో జట్టుకట్టారు. చెట్టపట్టాలేసుకుని తిరిగారు. రాష్ట్రస్థాయి పదవికి ఎదిగాక ఇక తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాకొచ్చారు.
ఇదంతా గతంలో జీవీఎంసీలో సుదీర్ఘకాలం ఇంజినీర్‌గా పనిచేసి, ఇప్పుడు ప్రజారోగ్యశాఖలో ఇంజినీర్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న పాండురంగారావు అక్రమార్జన బాగోతమని వేరేచెప్పనక్కర్లేదు. ఆయనతోనే జతకట్టిన కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ బాబు విజయకుమార్ కూడా ఆదాయానికి మించిన ఆస్తులను మూటగట్టారు. మూడో కంటికి తెలియకుండా సంపాదనలో మునిగితేలారు. ఇప్పుడు తన ప్రాణమిత్రుడు పాండురంగారావుతో కలిసి అవినీతి నిరోధకశాఖకు చిక్కారు.
సాక్షి, విశాఖపట్నం: పాండురంగారావు తన ఉద్యోగ ప్రస్థానాన్ని జీవీఎంసీలోనే ప్రారంభించారు. ఏఈగా చేరిన ఆయన డీఈఈ, ఈఈ, ఎస్‌ఈతో పాటు ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్, రెగ్యులర్ చీఫ్ ఇంజినీర్ పదవులను కూడా ఇక్కడే నిర్వహించారు. పైరవీల్లో దిట్టగా పేరొందిన ఆయన ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని తనకు కావలసిన చోట పోస్టింగు వేయించుకుంటారన్న పేరును అప్పట్లోనే గడించారు. అందులో భాగంగానే పలుమార్లు పదోన్నతులు పొంది ఎక్కడో బదిలీ అయినా తనదైన శైలిలో చక్రం తిప్పుతూ కొన్నాళ్లకే మళ్లీ కాసులు కురిపించే కామధేనువులాంటి జీవీఎంసీకి సునాయాసంగా వచ్చేసేవారు.
జీవీఎంసీలో పనిచేసినప్పుడు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్కడ పనిచేసినంతకాలం ఆ ఆరోపణలను ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలయిపోయేవి. ఇక ఆయనకు కేజీహెచ్ ప్రొఫెసర్, ప్రస్తుత డెప్యూటి సూపరింటెండెంట్ బాబు విజయకుమార్‌తో సాన్నిహిత్యం పెరిగాక సంపాదనపై దృష్టి సారించారు. ఇద్దరూ కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలెట్టారు. అలా మొదలైన అక్రమ సంపాదన అంతస్తులుగా ఎగబాకింది. ఇళ్లు, ఇళ్లస్థలాలు, అపార్ట్‌మెంట్లు, పెద్ద సంఖ్యలో భూములు, కోట్ల రూపాయల పెట్టుబడులు, బంగారు, వెండి ఆభరణాలు, కార్లు ఒకటేమిటి అన్నీ సమకూర్చుకున్నారు.
తమ ఆస్తులను నమ్మకస్తులైన బినామీల పేరిట పెట్టారు. వీరిద్దరు కలిసి తమ పిల్లలను డైరెక్టర్లుగా చూపుతూ దాదాపు వంద కోట్ల రూపాయల విలువచేసే సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రిని ఆరిలోవలో నిర్మాణాన్ని చేపట్టారు. వీటితో పాటు ఇంకా లెక్కతేలని అక్రమ ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లతో కలిసి కాంట్రాక్టు పనులు కూడా చేయిస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో విజయకుమార్‌కు వైద్యునిగా ప్రాక్టీసు బాగానే ఉండేదని, కొన్నాళ్లుగా అంతగా లేదని వైద్యులు చెబుతున్నారు. గతంలో వివాదాస్పద ఆమ్వే స్కీములోనూ విజయకుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ సోదాల్లో దొరికిన ఆదాయానికి మించిన ఆస్తుల విలువను స్థానిక అధికారులకు కళ్లు బైర్లుకమ్మేలా ఉన్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇంకా కొన్ని లాకర్లను శనివారం తెరిచే అవకాశం ఉంది.
ఒక్క విజయకుమార్ ఆస్తులే ప్రభుత్వ విలువ ప్రకారం రూ.3.58 కోట్లుగా తేల్చిన అధికారులు ఇందులో 2.63కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులుగా గుర్తించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న అశ్వని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికయ్యే పెట్టుబడి ఎంతన్నది తేలాల్సి ఉంది. శనివారం కూడా ఏసీబీ సోదాలు కొనసాగనున్నాయి. మరికొన్ని లాకర్లను తెరవనున్నారు. వాటిలో మరెన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు లభిస్తాయో చూడాలి. ప్రాణస్నేహితులుగా చలామణి అవుతున్న ప్రజారోగ్యశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ విజయకుమార్‌లు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏకకాలంలో రాష్ట్రంతోపాటు విశాఖ నగరంలోనూ పలుచోట్ల దాడులు నిర్వహించడం ఇటు జీవీఎంసీలోనూ, అటు కేజీహెచ్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. వీరిద్దరి అక్రమార్జన వందల కోట్ల రూపాయలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.