
పాపం పద్మ!
పద్మ అత్తింటి ముందు ఈనెల 5 నుంచి మౌనపోరాటం చేస్తుండగా 9న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సైతం స్పందించడంతో ఈనెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్టేషన్‌లో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. పద్మకు మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి, మహిళా ఛైతన్య సమాఖ్య సంఘాలు అండగా నిలిచాయి. భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆమెను వారికి అప్పగించారు. ఇంత జరిగినా అయితే అత్తింటి వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ పద్మను ఇంటిబయటే వదిలేసి, వారంతా పొలంలోని ఇంటికి వెళ్లిపోయారు.
పద్మ మాత్రం తన బిడ్డతో ఇంటి బయటే మౌనపోరాటం చేస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆరుబయట పసిపాపతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పద్మను చూసి చలించిన స్థానికులు గ్రామ సర్పంచ్ బత్తుల విజయశేఖర్‌కు విషయాన్ని తెలిపారు. దీంతో ఆయన, పలువురు పెద్దలు వారి ఇంటికి చేరుకుని, ఇంటి తలుపులు తెరచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని పద్మ వేడుకుంటోంది.