అనంతపురం న్యూసిటీ: ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లాంగ్ సర్వీసులకు డొక్కు బస్సులు వేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శుక్రవారం జడ్చర్ల టోల్‌గేట్ వద్ద జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. కదిరి డిపోకు చెందిన (ఏపీ29జడ్ 0649) బస్సు శుక్రవారం హైదరాబాదు నుంచి కదిరికి బయలు దేరింది. బస్సు కండీషన్‌లో లేకపోగా విపరీతమైన శబ్ధాలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. జడ్చర్ల టోల్‌గేట్ దాటాక బస్సును నిలిపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
బస్సులో విజేయుడు అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ జరిగిందనీ, బస్సు శబ్దాలతో ఆయన ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ వారి కుటుంబీకులు, ప్రయాణికులు డ్రైవర్ రమణను నిలదీశారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ, లేకపోతే వేరే బస్సు పంపాలంటూ కోరారు. అయితే డ్రైవర్ రమణ ‘ ఇష్టముంటే రండి లేకుంటే దిగిపోండి డబ్బులు ఇచ్చేది లేదు’ అని చెప్పారు. దీంతో గంటపాటు డ్రైవర్, ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విజేయుడు కుటుంబీకులు ఆర్‌ఎం చిట్టిబాబుకు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీనిపై శనివారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రయాణికులు తెలిపారు.
డొక్కు బస్సు.. ప్రయాణికుల కస్సు బుస్సు
Published Sat, Aug 20 2016 1:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement