మావోయిస్టుల చేతిలో పాస్టర్ హతం
మావోయిస్టుల చేతిలో పాస్టర్ హతం
Published Sat, Jul 30 2016 6:51 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
చింతూరు:
పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఓ చర్చి పాస్టర్‌ను మావోయిస్టులు శుక్రవారం అర్థరాత్రి హతమార్చారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం లచ్చిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని చర్చిలో పాస్టర్‌గా వ్యవహరిస్తున్న వుయికా మారయ్య(35) పదహారేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చి చింతూరు మండలంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి సాయుధ మావోయిస్టులు లచ్చిగూడెంలోని తన ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తన భర్తను లేపి చేతులు వెనక్కి కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టారని మృతుడి భార్య మంగమ్మ తెలిపింది. తనతోపాటు గ్రామస్తులు ఎంత అడ్డుపడినా తమను పక్కకు నెట్టేసి తన భర్తను వారివెంట గ్రామం పొలిమేర్ల వరకు తీసుకువెళ్లి గొంతుకోసి హతమార్చి మృతదేహాన్ని రహదారిపై పడేశారని ఆమె రోదిస్తూ చెప్పారు. ఇంటి ఆవరణలో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా మావోయిస్టులు తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.
ఇన్‌ఫార్మర్‌గా ఉన్నందునే...
పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుండడంతో మారయ్యను పలుమార్లు హెచ్చరించినా పధ్థతి మార్చుకోలేదని, అందుకే ప్రజాకోర్టులో అతన్ని శిక్షించినట్లు సంఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడిడిపెట్టి వెళ్లిన లేఖలో ప్రస్తావించారు. చింతూరు మండలానికి చెందిన మరి కొంతమంది పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తమ పధ్థతి మార్చుకోకపోతే ఇదే గతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. హత్య చేసిన అనంతరం వంకగూడెం గ్రామానికి చెందిన కణితి రాజు అనే గిరిజనుడిని మావోయిస్టులు తమవెంట తీసుకెళ్లి అనంతరం విడిచిపెట్టారు.
ఉనికిని చాటుకునేందుకే...
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, వారికి తగిన గుణపాఠం చెబుతామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చింతూరులో విలేకర్లకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి అమర వీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో మారయ్యను హతమార్చడం తూర్పు ఏజన్సీలో కలకలం రేగింది. వారోత్సవాలు ముగిసేలోపు ఎలాంటి ఘటనలకు పాల్పడుతారోనని ఆదివాసీ గూడేల్లో ఆందోళన నెలకొంది.
Advertisement
Advertisement