- ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే నిజమైంది
- రూ.387 కోట్ల అవినీతిని తప్పుపట్టిన కాగ్
- తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు
కమీషన్లకోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం
Published Sat, Apr 1 2017 11:55 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
కరప (కాకినాడ రూరల్) :
కమీషన్ల కోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని ఆనాడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే నిజమైందని ఆ పార్టీ తూర్పుగోదారి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా కరప మండలం కొంగోడు గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జేబులు నింపే ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎత్తిపోతల పథకాలను విస్మరిస్తున్నారని కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై తమ పార్టీ అధినేత అసెంబ్లీలో, బయట మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగి బురద జల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుడి, ఎడమ కాలువలు నిర్మిస్తే ఆ కాలువలపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి టీడీపీ ప్రభుత్వం అవినీతి గేట్లు ఎత్తారన్నారు. నిధులు దుర్వినియోగమయ్యాయన్న కాగ్‌కు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి లింగం రవి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కర్నాసుల సీతారామాంజనేయులు, జి.భావారం సర్పంచి రొక్కాల గణేష్, మాజీ సర్పంచులు కోట వెంకటేశ్వరరావు, బొమ్మిడి శ్రీనివాస్, గొల్లపల్లి ప్రసాదరావు, మారెళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement