
కోడి గుడ్ల స్కాంపై పీడీ విచారణ
కదిరి టౌన్ : ఐసీడీఎస్ శాఖలో కోడిగుడ్ల సరఫరాలో జరిగిన అవినీతి తంతుపై ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జుబేదాబేగం మంగళవారం విచారణ నిర్వహించారు. ఐసీడీఎస్ పడమర ప్రాజెక్టులో గతంలో కోడిగుడ్ల సరఫరాలో రూ.అరకోటి నిధుల స్వాహాపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి విచారణ బాధ్యతను కదిరి ఆర్‌డీఓ వెంకటేశును అప్పగించారు. ఆయన విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పీడీ స్థానిక ఐసీడీఎస్ పడమర ప్రాజెక్టు కార్యాలయాన్ని తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు.
అనంతరం ప్రాజెక్టుపరిధిలోని పట్టణంతోపాటు వివిధ మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు ఏ మేర సరఫరా జరిగాయి. ఎంత మేర నిధులు డ్రా అయ్యాయి. సంబంధిత కాంట్రాక్టరు, అధికారుల ద్వారా జరిగిన అవినీతి అక్రమాలపై రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ విలేకరులతో మాట్లాడుతూ ఇదివరకే ఆర్డీఓ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికను అందించారన్నారు. ప్రస్తుతం తుది విచారణ చేస్తున్నామన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు.