బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు?
Published Sat, Nov 26 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కర్నూలు(హాస్పిటల్): ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ ఒకటి నుంచే ఈ ప్రక్రియ చేపట్టేందుకు డీఆర్‌డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో ప్రస్తుతం 3,07,821 మంది లబ్ధిదారులు వివిధ కేటగిరీల్లో సామాజిక భద్రతా పింఛన్లు అందుకుంటున్నారు. వీరందరికీ రూపే కార్డులను బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. పింఛన్ పొందుతున్న వారిలో ఇంకా 67,400 మందికి బ్యాంకు ఖాతాలు లేనట్లు గుర్తించారు. వీరితో పాటు 91వేల మందికి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు గ్రామీణ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా లేని వారి నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, దరఖాస్తు, డిక్లరేషన్‌పై లబ్ధిదారులతో సంతకాలు తీసుకుని నేరుగా పింఛన్ పంపిణీ చేసే అధికారులే బ్యాంకు అధికారులకు వాటిని అందజేసి, ఖాతాలు తెరిపించాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రక్రియ పూర్తి చేసి సోమవారంలోగా ఖాతాలు లేని వారందరికీ తెరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర నోట్ల సమస్య ఏర్పడటంతో ఎలాగైనా డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అమలైతే ఇప్పటిలాగా పింఛన్ కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. నేరుగా వారి ఖాతాలోనే పింఛన్ సొమ్ము పడుతుంది కాబట్టి లబ్ధిదారులు రూపేకార్డు/ఏటీఎం కార్డులతో ఎప్పుడైనా సొమ్మును డ్రా చేసుకునే వీలుంటుంది. కాగా చాలా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ ఏటీఎంల వినియోగంపై సరైన అవగాహన లేదు. దీనికితోడు మార్కెట్‌లో రూపేకార్డులను ఉపయోగించి వస్తువులను ఎలా కొనుగోలు చేయాలో తెలియదు. ఈ కారణంగా చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement