పింఛన్లు.. పంతాలు! | pensions prestige | Sakshi
Sakshi News home page

పింఛన్లు.. పంతాలు!

Published Thu, Jan 5 2017 11:33 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో పింఛన్ల పంపిణీ ఎప్పుడని ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నిస్తున్న గ్రామస్తులు - Sakshi

శిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో పింఛన్ల పంపిణీ ఎప్పుడని ఎమ్మెల్యే అఖిలప్రియను ప్రశ్నిస్తున్న గ్రామస్తులు

గంగుల వర్సెస్‌ భూమా
- కొత్త పింఛన్ల పంపిణీకి బ్రేక్‌
- మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి కూడా
  భూమా వర్గానికే..
- జన్మభూమి కార్యక్రమాల్లోనూ
  ప్రాధాన్యత కరువు
- అధినేత తీరుతో గుర్రుగా గంగుల వర్గం
- మూకుమ్మడి రాజీనామాలతో
    నిరసనకు యత్నం 
- 12న సీఎం వద్ద పంచాయితీ
ఆళ్లగడ్డ: ఆ నాయకులు అసలే ఉప్పు.. నిప్పు. గంగుల.. భూమా వర్గాయుల మధ్య పచ్చిగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థంతో మొదటి నుంచి పార్టీకి పని చేస్తున్న గంగులను తక్కువ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన భూమాకు పచ్చ కండువా కప్పడం వివాదాలకు కారణమవుతోంది. గత మూడు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో పూర్తిగా చక్రం తిప్పిన నియోజకవర్గ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం స్థానికంగానే ఉన్నా కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఈయన వర్గీయులు సైతం ఆరు మండలాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జన్మభూమిలో ఎమ్మెల్యే అఖిలప్రియకు ప్రాధాన్యత కల్పిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. భూమా వర్గీయులకే అధికారులు కార్యక్రమాల్లో పెద్దపీట వేస్తుండటం వల్ల కూడా గంగుల వర్గం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ వైరం పింఛన్ల పంపిణీపైనా చూపుతోంది. పింఛన్లు కావాలని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 6,870 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,618 దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశారు. అయితే 3వేల పింఛన్లు మంజూరయ్యాయి. సీఎంతో మాట్లాడి సొంతంగా పింఛన్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వర్గం చెబుతుండగా.. జన్మభూమి కమిటీల ద్వారా ఎంపిక చేపట్టినట్లు గంగుల వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా పింఛన్ల మంజూరు విషయంలో గోప్యత పాటిస్తున్నారు. పింఛన్లు మంజూరైన విషయం తెలుసుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మాత్రం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీటిని పంపిణీ చేస్తారా, లేక వెనక్కు పంపుతారా అనే చర్చ జరుగుతోంది. 
 
చిచ్చురేపిన ఆళ్లగడ్డ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి
పార్టీలో చేరినప్పటి నుంచి తమ వర్గానికే మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి కావాలని ఎమ్మెల్యే వర్గం.. కాదు పార్టీ జెండా మోసిన తమ వర్గానికే కావాలని గంగుల వర్గం ఏడాదిగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ చెడ్డ కాకూడదని భావించిన సీఎం ఈ విషయాన్ని నాన్చుతూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చైర్మన్‌గా భూమా వర్గానికి చెందిన బి.వి.రామిరెడ్డి పేరును ఖరారు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఆ మేరకు ఈనెల 8, 9 తేదీల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవడాన్ని గంగుల వర్గం జీర్ణించుకోలేకపోతోంది.
 
12న సీఎంతో సమావేశం?
తమకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై తాడోపేడో తేల్చుకునేందుకు గంగుల వర్గం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవసరమైతే తమ వర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతో పాటు పార్టీ ఇన్‌చార్జీలతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. విషయం తెలియడంతో ఇన్‌చార్జి మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఎం ఈనెల 12న ఇరువర్గాలను విజయవాడకు రావాల్సిందిగా ఆహ్వానించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement