ఈ పాలనలో ప్రజలు నష్టపోతున్నారు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు పాలనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనను చూస్తున్న ప్రజలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు సందర్భంగా బుధవారం హన్మకొండలో జరిగిన ర్యాలీలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనతో విగిసిపోయిన ప్రజలు వైఎస్ పాలనను కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని రైతు ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ఇదే పరిస్థితి ఉంది. వైఎస్సాఆర్ మరణం తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలి’ అని అన్నారు.
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు వైఎస్ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ప్రజలకు చక్కటి పాలన అందించేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తనను బలపరచాలని ప్రజలను కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కిష్టారెడ్డి, కె.శివకుమార్, మతిన్ ముదాదిన్, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నేతలు బీష్వ రవీందర్, జి.నాగిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, సింగి రెడ్డి భాస్కర్‌రెడ్డి, వీఎల్‌ఎన్.రెడ్డి, జైరాజ్, సిద్ధార్థరెడ్డి, ప్రఫుల్లారెడ్డి, సురేశ్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.