-
పెట్రోలుపై రూ.1.34, yీ జిల్‌పై రూ.2.37 పెంచిన కేంద్రం
-
పన్నుపోటుతో అదనంగా బాదేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
జిల్లాపై నెలకు రూ.7.75 కోట్లు పైగా భారం
-
నెలన్నరలో మూడుసార్లు వడ్డన
సాక్షి, రాజమహేంద్రవరం :
పెట్రో ధరల బాంబు మరోమారు పేలింది. లీటర్ పెట్రోలుపై రూ.1.34, డీజిల్‌పై రూ.2.37 చొప్పున పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 63 పైసలు, డీజిల్‌పై 53 పైసల మేర పన్ను విధించింది. ఫలితంగా శనివారం వరకూ రూ.69.78గా ఉన్న లీటర్ పెట్రోలు ధర ఆదివారం రూ.71.72కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.58.78 నుంచి రూ.61.68కు పెరిగింది.
45 రోజుల్లో భారం మోపారిలా..
గడచిన 45 రోజుల వ్యవధిలో పెట్రో ధరలను మూడుసార్లు పెంచారు. తాజా వడ్డనతో కలిపి ఈ నెలన్నర వ్యవధిలో పెట్రోలుపై రూ.4.86, డీజిల్‌పై రూ.4.84 మేర వినియోగదారులపై భారం పడింది. గత నెల ఒకటో తేదీన పెట్రోలుపై రూ.3.38, డీజిల్‌పై రూ.2.37 చొప్పున ధరలు పెరిగాయి. ఈ నెల 4వ తేదీన డీలర్ల కమీషన్ పెంచే పేరుతో పెట్రోలుపై 14 పైసలు, డీజిల్‌పై 10 పైసల చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. దీనికి తాజా పెంపు తోడైంది.
రోజుకు రూ.26 లక్షల బాదుడు
తాజా పెరుగుదలతో జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.26 లక్షల భారం పడుతోంది. జిల్లాలో 251 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజూ సుమారు 5 లక్షల లీటర్ల పెట్రోలు, 8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. లీటర్ పెట్రోలుపై రూ.1.34 పెంచడంతో రూ.6.90 లక్షలు, లీటర్ డీజిల్‌పై రూ.2.37 పెంచడంతో రూ.18.96 లక్షల చొప్పున రోజుకు దాదాపు రూ.25.86 లక్షల మేర వినియోగదారులపై అదనపు భారం పడింది. ఈ లెక్కన జిల్లాపై నెలకు రూ.7.75 కోట్ల భారం పడుతోంది.
డీజిల్‌కన్నా విమాన ఇంధనం ధర తక్కువ
పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించే పెట్రోల్, డీజిల్ ధరల కన్నా ధనికుల ప్రయాణ సాధనమైన విమాన ఇంధనం ధర తక్కువగా ఉండడం గమనార్హం. విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర కన్నా డీజిల్ ధర సుమారు రూ.8 పైగా ఎక్కువగా ఉంది. విశేషం. లీటర్ ఏటీఎఫ్ ధర రూ.46.82 కాగా, డీజిల్ ధర రూ.54.98 కావడం గమనార్హం. ఏటీఎఫ్ ధరకన్నా పెట్రోల్ ధర దాదాపు 50 శాతం అధికంగా ఉంది.
పేదల జేబుకు చిల్లు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. ద్విచక్రవాహనదారుల నెలవారీ పెట్రోలు ఖర్చు తక్కువలో తక్కువ రూ.200 పెరగనుంది. పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలకు అనుగుణంగా ఆటోవాలాలు కూడా చార్జీలు పెంచే పరిస్థితి నెలకొంది. ఆటో చార్జీలు పెంచితే తిరిగి ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుంది. ఒకవేళ పెరిగిన ధరలను ఆటోవాలాలే భరిస్తే ఆ మేరకు నష్టపోవాల్సి వస్తుంది. మరోపక్క పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీల రవాణా చార్జీలు కూడా పెరగనున్నాయి. ఆ మేరకు నిత్యావసరాలు, కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. వీటన్నింటి ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది.
రోజుకు రూ.30 కోల్పోతున్నాను
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నిత్యావసరాల ధరలు, పిల్లల స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి. రోజుకు 18 గంటలు ఆటో నడుపుతూంటే మూడు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు డీజిల్ ధర పెరగడం వల్ల రోజుకు రూ.30 వరకూ నష్టపోవాల్సి వస్తుంది. డీజిల్ ధరల పెంపు మేరకు చార్జీలు పెంచలేని పరిస్థితి.
– దూనబోయిన శ్రీనివాస్, ఆటోవాలా, రాజమహేంద్రవరం
మధ్యతరగతివారికి ఇబ్బందులే..
పెట్రో ధరలను అదుపు చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈమధ్య కాలంలో తరచూ పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి వారికి ఇబ్బందులు తప్పవు. ధరల పెంపు నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఉంది.
– దంగేటి నాగేశ్వరరావు, దంగేరు, కె.గంగవరం మండలం