కాలేజీ బస్సును ఢీకొట్టిన ట్యాంకర్
► రేపూడిలో సినీ ఫక్కీలో ప్రమాదం
►ఐదుగురు విద్యార్థులకు గాయాలు
►ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం
► జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఫిరంగిపురం: సినీ ఫక్కీలో రహదారిపై మెలికలు తిరుగుతూ ఓ పెట్రోల్ ట్యాంకర్ వేగంగా కళాశాల బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండలంలోని రేపూడి శివారులో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. నరసరావుపేట శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన బస్సు ఫిరంగిపురం, వేములూరిపాడు, రేపూడి గ్రామాల నుంచి 15 మంది విద్యార్థినులతో శనివారం నరసరావుపేటకు బయల్దేరింది..
రేపూడి శివారుకు చేరుకునే సమయానికి ఎదురుగా నరసరావుపేట నుంచి తాడేపల్లి వెళుతున్న పెట్రోలు ట్యాంకర్ సినీ ఫక్కీలో చక్కర్లు కొడుతూ ఎదురుగా వస్తోంది. బస్సు డ్రైవర్ వాసు, విద్యార్థినులు గుర్తించి పెద్దగా కేకలు వేస్తూనే ఉన్నారు. ఇంతలోనే ట్యాంకర్ బస్సును ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ అమాంతం వచ్చి బస్సు పక్కన ఆగింది. బస్సు ముందు అద్దాలు పగిలి పలువురిపై పడ్డాయి. మరికొందరు కిందపడి గాయాలపాలయ్యారు. ట్యాంకర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అటుగా వస్తున్న వాహనదారులు ఘటన స్థలంలో ఆగి క్షతగాత్రులను బస్సు నుంచి దించారు.
ఐదు నిమిషాల వ్యవధిలోనే..
బస్సు బయలుదేరిన ఐదు నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరగడం విశేషం. కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరగడం, విద్యార్థినులు గాయపడటం అన్నీ జరిగిపోయాయి. వాహనదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను చూసిన విద్యార్థినులు కన్నీటి పర్వంతమయ్యారు. క్షతగాత్రులను పరామర్శించడానికి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్విగ్నంగా మారింది. కేవలం ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకర్ అదుపుతప్పి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని చెప్పారు.
కేసు నమోదు...
తొలుత ఘటనపై ఎస్సై ఎం.ఆనందరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బస్సు, ట్యాంకర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిలిచిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయాలపాలైన విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.