
ఫిట్‘లెస్’
- నిబంధనలకు అనుగుణంగా లేని స్కూల్ బస్సులు
- కండీషన్‌పై దృష్టి సారించని యాజమాన్యాలు
- విద్యార్థుల జీవితాలతో చెలగాటం
- గత నెల 15తోనే ముగిసిన ఫిట్‌నెస్ గడువు
- 987 బస్సులకు గాను 341కు మాత్రమే ఫిట్‌నెస్
బడి గంటలు మోగే సమయం దగ్గర పడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు చేయిస్తున్నారు. అయితే.. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై చూపడం లేదు. కండీషన్ లేకపోయినా దశాబ్దాల తరబడి పాత బస్సులనే తిప్పుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు, అక్కడి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులే అధికంగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేసిన చిన్నారులు తిరిగి పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం పిల్లల అడ్మిషన్లపై దృష్టి సారిస్తున్నాయే తప్ప వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంపై చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థుల రాకపోకలు సాగించేందుకు వినియోగిస్తున్న బస్సుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలలు స్థాపించి ఇరవై, ముప్పై ఏళ్లు అవుతున్నా ప్రారంభం నుంచి అవే బస్సులను తిప్పుతుండటం ఒకింత ఆందోళన కల్గిస్తోంది.
ఫిట్‘లెస్’ బస్సులే ఎక్కువ..
స్కూల్ బస్సులకు గత నెల 15తోనే ఫిట్‌నెస్ రెన్యూవల్ గడువు ముగిసింది. జిల్లాలో మొత్తం 987 స్కూల్ బస్సులు ఉన్నాయి. గడువు మీరిపోయినా కొన్ని యాజమాన్యాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకూ 341 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందినట్లు ఆర్టీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. అనేక స్కూల్, కళాశాలల యాజమాన్యాలు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సెకండ్‌హ్యాండ్ (ఇదివరకే వినియోగంచిన) బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. తక్కువ ధరకు వచ్చిన వీటికి పెయింటింగ్ మార్చి స్కూల్ బస్సులుగా తిప్పుతున్నారు. 20, 30 ఏళ్లుగా తిరుగుతున్నా అధికారులు వీటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ జరగరానిది జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు తప్పనిసరి
స్కూల్ బస్సుల విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు విధించినప్పటికీ కొన్ని యాజమాన్యాలు వాటిని తుంగలో తొక్కుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర ద్వారం, అగ్నిని నిరోధించే సిలిండర్, ప్రథమ చికిత్స పరికరాల కిట్, విద్యార్థులు ఎక్కేందుకు అనువుగా మెట్లు (ఫుట్‌స్టెప్), హ్యాండ్‌బ్రేక్, హెడ్‌లైట్స్, బ్యాక్‌లైట్స్, ఇండికేటర్స్, అంబర్‌లైట్స్, ముందు భాగాన తెలుపు, వెనుక ఎరుపు, సైడ్‌కు పసుపుపచ్చ రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలి. తాజా నిబంధనల ప్రకారం 60 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకుండా స్పీడ్ గవర్నర్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు బస్సు కండీషన్ ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న స్కూల్ బస్సుల్లో యాభై శాతానికి పైగా నిబంధనలు పాటించడం లేదు. అయినా అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుంటే సీజ్ : సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్, అనంతపురం
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు గడువు మే 15కే పూర్తయ్యింది. ఇప్పటికీ ఫిట్‌నెస్ కోసం స్కూల్ బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు కావడంతో వాటిని మరమ్మతులు చేసుకుంటున్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి బస్సుకూ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అది లేకుండా నడిపితే సీజ్ చేయడంతో పాటు కోర్టుకు హాజరుపరుస్తాం.