కడప అర్బన్ : ఎపీఎస్ ఆర్టీసీలో మోసపూరితమైన చర్యలతో యాజమాన్యం కార్మికులను ఇప్పటికీ వేధిస్తోందని, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా సంస్థను ఇబ్బందుల పాల్జేస్తున్నారనీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజనల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట సామూహిక రిలే దీక్షలను చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడప రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం మొండివైఖరిలో మార్పు రావాలన్నారు. కార్మికులను బుద్ధిపుట్టినట్లు బదిలీలు చేయడం, డీఎంలు నియంతల్లాగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆత్మీయ పిలుపు పేరుతో కార్మికులను మీటింగ్‌లకు పిలువడం, మరింత పనిభారాన్ని పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. కంప్యూటర్ల ముందు కూర్చొనే అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపే కండక్టర్, డ్రైవర్లను అరగంట, గంట ముందే వచ్చారని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రతి కండక్టర్, డ్రైవరు గంట, రెండు గంటలు అదనంగా పనిచేస్తున్నారన్నారు. కార్మికులను ఇంకా ఏదైనా ఇబ్బందిపెడితే అధికారుల జట్టు పట్టుకునే కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదన్నారు. ప్రజా రవాణా సంస్థ అని ఎన్నో దశాబ్దాలుగా నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నా వినిపించుకునే పరిస్థితుల్లో యాజమాన్యం, అధికారులు లేరన్నారు. ప్రైవేటు సంస్థలతో ఈ సంస్థను పోల్చుకుని తప్పుడు ఆలోచనలతో ప్రభుత్వం ముందు మెహర్బానీ కోసం లేనిపోని ఆలోచనలు చేస్తే ఉద్యమం తప్పదన్నారు. రీజినల్ మేనేజర్లు చాలా కష్టపడి పోతున్నామని పేరుకే చెబుతున్నారన్నారు. బహిరంగ చర్చకు వచ్చి వాస్తవ పరిస్థితిని ఎండీకి, ప్రభుత్వానికి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. విద్యుత్ కార్మికులకు పెరిగిన వేతనాల స్థాయి, ఆర్టీసీ కార్మికునికి ఎందుకు పెరగలేదన్నారు. ఆర్టీసీ సంస్థకు నష్టమనే పదం వర్తించదన్నారు. ఆస్తులను, బస్సులను తాకట్టు పెట్టి సంస్థను నడుపుతున్నామని కల్లిబొల్లి మాటలు చెప్పడం సరికాదన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. గూడ్స్ ట్రాన్స్‌పోర్టు విషయాన్ని ఈయూ రెండు దశాబ్దాలుగా చెబుతూనే ఉందన్నారు. అయినా యాజమాన్యం పెడచెవిటిన పెట్టిందన్నారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య, రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు రామిరెడ్డి, నాగముని, కడప డిపో సెక్రటరీ ఏఆర్ మూర్తి పాల్గొన్నారు.