జార్జియా అధ్యక్షునిగా సాకర్‌ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా? | Georgian government votes in far right former soccer player as president | Sakshi
Sakshi News home page

జార్జియా అధ్యక్షునిగా సాకర్‌ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా?

Published Sat, Dec 14 2024 7:23 PM | Last Updated on Sat, Dec 14 2024 7:58 PM

Georgian government votes in far right former soccer player as president

టిబిలిసీ: జార్జియాను ఈయూ(యూరోపియన్‌ యూనియన్‌)లో కలపాలనే తీవ్ర నిరసనల నడుమ జార్జియా అధ్యక్షుడిగా మాజీ సాకర్‌ ఆటగాడు మైకేల్‌ కవెలాష్విలి)53) ఎంపికయ్యారు.  1990 ప్రాంతంలో  ఇంగ్లిష్‌ సాకర్‌ టీమ్‌ మాంచెష్టర్‌ సిటీకి ప్రాతినిధ్యం వహించిన కవెలాష్విలి.. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  రష్యా చేతిలో పావుగా మారే అధికార పార్టీ ఈయూలో జార్జియాను కలపడానికి నిరాకరిస్తుందనే తీవ్ర నిరసనల అనంతరం ఆ దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.

అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కవెలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్‌ వేశారు. మొత్తం 300(ఎంపీలు- స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు)మంది సభ్యులకు గాను 225 మంది సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ మేరకు 224 మంది కవెలాష్విలి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకూలంగా ఓటేయడం విశేషం.  దాంతో కవెలాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయ్యింది.  

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ  ఎన్నికను నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి  నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్‌ను బహిష్కరించడం కూడా కవెలాష్విలి ఏకగీవ్రంగా ఎన్నిక కావడానికి ఒక రకంగా దోహదం చేసింది.

అయితే పశ్చిమ దేశాల ఆధిపత్యంపై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కవెలాష్విలికి రాబోయే కాలం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రష్యా అనుకూల శక్తులు, మరొకవైపై యూరోపియన్‌ యూనియన్‌ అనుకూల నిరసనకారుల నడుమ ఉద్రిక్త పరిస్థితులను కవెలాష్విలి ఏ విధంగా నియంత్రిస్తారో అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.

నేను  ఇక్కడే ఉన్నా.. !
మాజీగా మారిన అధ్యక్షురాలు సలోమ్‌ జౌరాబిచివలి మాత్రం అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను  దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివర్ణించారు.  దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు.  తాను ఇక్కడే ఉన్నానని, మళ్లీ వస్తాననని యూరోపియన్‌ యూనియన్‌ నిరసనకారులకు అనుకూలంగా ఉన్న ఆమె అంటున్నారు.

అసలు ఏం జరిగింది..?
యురోపియన్‌ యూనియన్‌లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.ఈయూ, జార్జియన్‌ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్‌ వెలుపల ర్యాలీ నిర్వహించారు. 

కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్‌ 26న ఎన్నికలు జరిగాయి.

వీటిని యురోపియన్‌ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్‌ డ్రీమ్‌ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్‌ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

డబ్బు ప్రవాహం, డబుల్‌ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్‌ జరిగిందని యూరోపియన్‌ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్‌ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్‌ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

దీనికి అధికార జార్జియన్‌ డ్రీమ్‌ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement