స్థలం కనిపిస్తే కబ్జా | place looks.. and kabja | Sakshi
Sakshi News home page

స్థలం కనిపిస్తే కబ్జా

Published Tue, Sep 20 2016 4:32 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

స్థలం కనిపిస్తే కబ్జా - Sakshi

స్థలం కనిపిస్తే కబ్జా

* చందవరంలో టీడీపీ నాయకుడి దందా
ప్రభుత్వ పోరంబోకు భూమిలో మెరక తోలిన వైనం
పట్టించుకోని రెవెన్యూ అధికారులు 
 
ఖాళీ స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. దర్జాగా దందాలు చేస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ యంత్రాంగం సహకారంతోనే అక్రమార్కులు భూములు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా వదలడంలేదు. గ్రామస్థాయి టీడీపీ నాయకులే ఈ విధమైన దురాగతాలకు పాల్పడుతుంటే ఇక జిల్లా, ఆ పై స్థాయి వారు ఏ విధమైన అరాచకాలకు తెగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
 
చందవరం (నాదెండ్ల): అధికారం మాటున ఎలాంటి అక్రమాలకైనా పాల్పడొచ్చనే దీమాతో ఉన్నారు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో తమ అధికార దర్పం ప్రదర్శిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మండలంలోని చందవరం గ్రామంలో ఓ టీడీపీ నాయకుని నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 
 
ప్రభుత్వ భూమిలో చెట్ల తొలగింపు
గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 117/1లో 80 సెంట్లు, 1172బీలో 16 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమి. దీని పక్కనే 253/1 – య.10.66 సెంట్లు, 253/2 – 3 సెంట్లు, 253/3 – 72 సెంట్లు మొత్తం య.11.41 సెంట్లు భూమి రక్షిత నీటి చెరువు. దీని పక్కనే సాతులూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న 96 సెంట్లు స్థలంలో కొంత రోడ్డుకు పోను సుమారు 40 సెంట్లు భూమి మిగిలి ఉంది. ఈ భూమిలో ఇటీవల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పిచ్చి చెట్లు తొలగించి మెరక తోలించాడు. 2014లోనే ఈ స్థలంలో పిచ్చిచెట్లు తొలగించి ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. అప్పట్లో గ్రామస్తులు వ్యతిరేకించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
లోకాయుక్తాకూ ఫిర్యాదు...
అప్పట్లో లోకాయుక్త ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని బోర్డు పెట్టారు. దీంతో టీడీపీ నేత కొంత వెనక్కు తగ్గారు. రెండేళ్ళ అనంతరం తిరిగి స్థలాన్ని కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇటీవల పక్కనే ఉన్న చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి స్థలంలో మెరక పోశాడు. ఎస్సీ కాలనీ శ్మశానవాటిక సమీపంలో ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జాచేసి మట్టి తోలించాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకుంటే సహించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.
 
మా దృష్టికి రాలేదు..
దీనిపై తహశీల్దార్‌ మేడూరి శిరీషను ప్రశ్నించగా 2014లో కోర్టు ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వ స్థలమేనని బోర్డు పెట్టాం. అయితే ప్రస్తుతం ఈ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు మట్టి తోలిన విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటాం. స్వయంగా వెళ్ళి పరిశీలిస్తాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement