మాట్లాడుతున్న కలెక్టర్ రోనాల్డ్ రోస్
- నివేదికల్లో తేడాలుంటే చర్యలు
- కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆదేశం
- హరితహారంపై అధికారులతో సమీక్ష
సంగారెడ్డి: హరితహారంలో భాగం గా జిల్లా వ్యాప్తంగా నాటిన మొక్కలకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని అందించాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ హరితహారంపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎంపీడీఓలు, వివిధశాఖల జిల్లా అధికారులు సమర్పించే నివేదికల మధ్య సమన్వయం కొరవడుతుందన్నారు. హరితహారంపై రోజు వారీగా ప్రభుత్వానికి మూడు రకాల నివేదికలు పంపాల్సి ఉంటుందన్నారు. అందుకోసం ఎంపీడీఓలు, జిల్లా అధికారులు కచ్చితమైన సమాచారాన్ని సత్వరమే అందించాలని సూచించారు.
బాలల హరితహరంపై ప్రత్యేకంగా వివరాలు అందజేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను కోరారు. మండల స్థాయిలో ఉపాధి హామీ కింద గుంతలు తీయడం, మొక్కలు నాటడం విషయంలో వ్యత్యాసాలు కన్పిస్తున్నట్టు తెలిపారు. క్షేత్ర స్థాయిలో జరిగిన పనులు కాగితాలపై కనిపించాలని ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలు అందుబాటులో లేవని చెప్పడం సరికాదన్నారు. నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నందున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ వెంకటరామిరెడ్డి, డీఆర్వో దయానంద్, డ్వామా పీడీ సురేందర్‌కరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.