
సారూ.. సదువు ఆగమైంది
‘సారూ...! మా ఊళ్లో 15మంది పోరగాళ్లు సదువు కోసం రెండు కిలోమీటర్ల దూరంలో గల బూర్గుపల్లికి మండుటెండలో నడిచి పోతున్నరు.
♦ మూతపడిన బడులను తెరిపించండి
♦ పిల్లలు లేరని మూసివేయొద్దు
♦ పోరగాళ్లు మండుటెండల్లో నడిచి వెళుతుండ్రు
♦ సుప్రీం కోర్టు బృందం ఎదుట తల్లిదండ్రుల ఆవేదన
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘సారూ...! మా ఊళ్లో 15మంది పోరగాళ్లు సదువు కోసం రెండు కిలోమీటర్ల దూరంలో గల బూర్గుపల్లికి మండుటెండలో నడిచి పోతున్నరు. మండే ఎండలను భరించలేక ఎండకాలంలో పెడుతున్న మధ్యాహ్న భోజనానికి సైతం వెళ్లడం లేదు. బడీడు ఉన్నోళ్లు 10 నుంచి 15 మంది ఉన్నరు. ఇంతకుముందున్న టీచర్‌ను మార్చి.. మూతపడ్డ బడిని మళ్లా తెరిపించండి’ అంటూ సిద్దిపేట మండలం ఎన్‌సాన్‌పల్లి మధిర తిప్పరబోయిన కాలనీ కి చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టు అధ్యయన బృందం ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. విద్యార్థులు లేక జిల్లాలో గత ఏడా ది 24 పాఠశాలలు మూతపడ్డాయి.
దీంతో తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ తరఫున సాగర్‌రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అధ్యయన బృందాన్ని సోమవారం మెదక్ జిల్లాకు పంపింది. ఈ బృందంలో అశోక్ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్‌రావు ఉన్నారు. వీరు సిద్దిపేట మండలం ఎన్‌సాన్‌పల్లి మధిర తిప్పరబోయిన కాలనీ, నంగనూర్ మండలం తిమ్మాయిపల్లి మదిర భాషాగూడెం, గట్ల మల్యాల మధిర సీతారంపల్లి, హనుమాన్ నగర్, రాజగోపాల్‌పేట మదిర ఫకీర్ కాలనీల్లో పర్యటించి పాఠశాలలను పరిశీలించారు. ఈ పాఠశాలల మూసివేతకు గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తిప్పరబోయిన కాలనీ వాసులు సుప్రీంకోర్టు బృందంతో మాట్లాడుతూ గత ఏడాది ఆరుమంది విద్యార్థులే ఉన్నారన్న కారణంతో పాఠశాలను మూసివేసి, అక్కడి టీచర్‌ను డిప్యూటేషన్‌పై పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు కిలోమీటర్ల దూరంలో గల బూర్గుపల్లికి పిల్లలు నడిచి వెళ్తున్నారన్నారు. ఎండాకాలం, వానకాలం వస్తే అనేక తిప్పలు పడుతున్నారని వాపోయారు. ఇంతకు ముందున్న సార్‌ను మార్చి కొత్త టీచర్‌తో బడి మళ్లా తెరిపించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. నంగునూరు మండలం భాషాగూడెంలో సైతం గత ఏడాది కేవలం ఆరుగురు పిల్లలే ఉండటంతో పాఠశాలను మూసివేశారు.
సీతారాంపల్లిలో నలుగురు, హనుమాన్ నగర్‌లో 5మంది, ఫకీర్ కాలనీలో 5మంది విద్యార్థులుండటంతో ఆ పాఠశాలలను మూసివేశారు. దీంతో విద్యార్థులంతా సమీప గ్రామాల్లో గల పాఠశాలలకు సుమారు 2,3 కిలో మీటర్లునడిచి వెళ్తున్నారని తల్లిదండ్రులు సుప్రీం బృందానికి నివేదించారు. ఈ బృందం వెంట మెదక్ డీఈఓ నజీమొద్దీన్, సిద్దిపేట డిప్యూటీఈఓ శ్యాంప్రసాద్‌రెడ్డిలు ఉన్నారు. నంగునూర్ ఎంఈఓ దేశిరెడ్డి, సిద్దిపేట ఎంఈఓ ప్రసూనదేవి, న్యాయవాది శ్రవన్ తదితరులు ఉన్నారు.
భారమవుతున్న మధ్యాహ్న భోజనం: ఆవాస ప్రాంతానికో పాఠశాల ఉండాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 100-150 జనాభా గల పల్లెల్లో సైతం పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కో పాఠశాలలో 10 నుంచి 15మందికంటే ఎక్కువగా విద్యార్థులు లేకుండా పోయారు. ఉపాధ్యాయుల నిర్లక్ష ్యం, అరకొర వసతుల కారణంగా అందులో కొంతమంది ప్రైవేట్ పాఠశాలలవైపు వెళ్ళారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య 5నుంచి 6కే పడిపోయింది.
అయితే ఆరుమంది విద్యార్థులకు వండిపెట్టడం ఏజెన్సీ మహిళలకు గిట్టుబాటు కాకపోవడంతో మధ్యాహ్న భోజనం నడిపించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులు కూడా మొక్కుబడిగా పాఠశాలకు వెళ్లిరావడం ఒక తంతుగామారిందన్న ఆరోపణలున్నాయి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లినా.. మీటింగ్‌కు వెళ్లినా.. శిక్షణ కార్యక్రమానికి వెళ్లినా..ఇతర బోధనేతర కార్యక్రమాలకు వెళ్లినా...పాఠశాలలు తెరువలేని పరిస్థితి. దీంతో రోజు రోజుకు పాఠశాలల నిర్వహణ భారంగా మారడంతో ఆ పాఠశాలలను మూసివేసి అక్కడి టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపినట్లు విద్యాధికారులు చెబుతున్నారు.
13న సుప్రీంకోర్టులో విచారణ: ప్రభుత్వ పాఠశాలలో వసతుల లేమి, లోపించిన ఉపాధ్యాయుల జవాబుదారితనం, కానరాని అధికారుల పర్యవేక్షణ తదితర కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడి నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ పేరెంట్ ఫెడరేషన్ తరపున సాగర్‌రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఫిర్యాదుచేయగా, న్యాయవాది శ్రవణ్ కేసును వాదిస్తున్నారు. జూన్ 13న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి సుప్రీం కోర్టు అధ్యయన బృందం ముగ్గురు సభ్యులను జిల్లాకు పంపింది. ఈ బృందం జూన్ మొదటి వారంలో క్షేత్రస్థాయి నివేదికను అందించనుంది.