పరువుకు ‘గండి ’
కోట్ల రూపాయల పనుల నాణ్యతపై అనుమానాలు
వైఫల్యాలకు సమాధానం కరువు
విద్రోహ చర్య అని సన్నాయి నొక్కులు
పల్లెర్లమూడి(నూజివీడు రూరల్) :
నదుల అనుసంధానం అన్నారు, దేశంలో ఎక్కడా లేదని ఊదరగొట్టారు. గడువు ముంచుకొస్తోందని అడ్డగోలుగా పనులతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఆ వైఫల్యమే భారీ గండి రూపంలో బయటపడింది. కట్టేటప్పుడే నాణ్యత పాటించి ఉంటే ఇప్పుడింత హడావుడి ఉండేదే కాదు.
పోలవరం కుడికాలువపై మండలంలోని పల్లెర్లమూడి రామిలేరు అండర్‌టన్నెల్ వద్ద పడిన గండితో పనుల నాణ్యతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హడావుడి పనులు, మట్టిదిబ్బలకు పైపైన కాంక్రీట్‌ని పూసి మసిపూసి మారెడు కాయ అన్నట్లు పనులను నాణ్యత లేమితో చేపట్టారనే విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. పట్టిసీమ పనులు నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందనేది ఎంత వాస్తవమో పనుల నాణ్యత కూడా అంతే వాస్తవమని పలువురు ఆరోపిస్తున్నారు. మేడిపండు చందంగా పనులు చేపట్టి తామేదో ఘనకార్యం చేసినట్లు అధికార పార్టీ నాయకులు హడావుడి చెయ్యడం దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. గోదావరి – కృష్ణానదులను అనుసంధానం చేసినట్లు ఊరువాడ ప్రచారం చేస్తున్న అధికార పార్టీ నాయకులు పనుల నాణ్యతలో జరిగిన అవకతవకల గురించి ప్రజలకు ఏమని సమాధాన చెబుతారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రామిలేరు వద్ద పడిన గండితో పనులలోని డొల్లతనం ౖ»ñ టపడటంతో అధికార పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు. పోలవరంకుడికాలువపై రామిలేరు వద్ద గండిపడటంతో ప్రభుత్వానికి తలవంపులుగా మారిందనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఈ వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి విద్రోహుల చర్య అంటూ కొత ్తపల్లవి అందుకున్నారనేది సుష్పష్టం. గండి పూడ్చే పనులను చేపడుతున్న అధికారులు, పోలీసులు, కూలీలు కూడా పచ్చ నాయకుల మాటలు విని విస్తుపోవడం వారి వంతు అయ్యింది. పనులలోని డొల్లతనం స్పష్టంగా కనబడుతున్నప్పటికి అధికార పార్టీ నాయకులుఅదే పనిగా బుకాయించడం పట్ల ప్రజలు టీడీపీ నాయకుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వతంత్య్ర సంస్థతో దర్యాప్తు జరపాలి
పనుల్లో నాణ్యత లోపాలపై స్వతంత్ర సంస్థపై దర్యాప్తు జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. కోట్ల రూపాయలు కాలువ పాలైనట్లు ఆవేదన వ్యక్తంచేశారు. అత్యంత నాసిరకమైన పనుల వల్లే కాలువకు గండి పడిందని చెబుతున్నారు. కాలువ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి బలహీన పాయింట్లను గుర్తించి పటిష్టం చేయాలని, గండ్లు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులకు కారణమైన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లను గుర్తించి చర్యలు చేపడితే మునుముందు జాగ్రత్త వహిస్తారని అన్నారు.