నిర్వాసితుల పట్ల ప్రభుత్వం వివక్ష
చింతూరు (రంపచోడవరం) : పోలవరం కాంట్రాక్టర్లకు కోట్లు దోచిపెడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు మాత్రం మొండిచేయి చూపిస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం చింతూరులో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చె
ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
చింతూరు (రంపచోడవరం) : పోలవరం కాంట్రాక్టర్లకు కోట్లు దోచిపెడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు మాత్రం మొండిచేయి చూపిస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం చింతూరులో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెబుతోన్న ముఖ్యమంత్రి ఇంతవరకూ నిర్వాసితుల పునరావాసంపై దృష్టి పెట్టలేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నిర్వాసితుల బతుకులు ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉందని, నిర్వాసితుల పట్ల సీఎం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఇప్పటికే ముంపు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని, అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. ముంపు పేరుతో రహదారులు, ఇండ్లు, మరుగుదొడ్లు కూడా నిర్మించకపోవడంతో నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. వారికి ప్యాకేజీ త్వరగా ఇస్తే ఎక్కడికైనా వెళ్లి కూలోనాలో చేసుకుని బతుకామని నిర్వాసితులు చెబుతున్నారని, వారి ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గిరిజనులు, గిరిజనేతరుల నడుమ అధికారులు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గిరిజనేతరులకు కూడా నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో భూమి ఇవ్వాలని స్వయంగా గిరిజనులే చెబుతున్నా అధికారులు బాధ్యతా రాహిత్య ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. తొలుత చింతూరు మెయిన్‌రోడ్ సెంటర్‌లోని దివంగత సీఎం వైఎస్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వాసితులతో కలసి ఐటీడీఏ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐటీడీఏ పీఓ చినబాబు, ఆర్డీఓ ఎల్లారమ్మ బయటకు వచ్చి నిర్వాసితులతో చర్చించారు. నిర్వాసితుల డిమాండ్లను కలెక్టర్‌తో పాటు పునరావాస అధికారి దృష్టికి తీసుకెళతామని వారు హామీ ఇచ్చారు. అనంతరం నిర్వాసితుల తరపున ఎమ్మెల్యే రాజేశ్వరి అధికారులకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాలకు చెందిన నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిర్వాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఆసిఫ్, మురళి, వీరబాబు, జగదీష్, ఎండీ మూసా, శివరాజు, విజయలక్ష్మి, బాలు, రవి, వీరాంజనేయులు, చింతూరు జెడ్పీటీసీ సభ్యురాలు సోయం అరుణ, వైస్ ఎంపీపీ పండా నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు సోడె బాయమ్మ, సర్పంచ్‌లు ఆకేటి సీత, కృష్ణకుమారి, సూరమ్మ, ఏసుబాబు పాల్గొన్నారు.