కొత్త చట్టం ప్రకారమే పోలవరం ప్యాకేజి
మరో 90 గ్రామాలను ముంపులో చేరుస్తూ త్వరలో జీవో
సర్వే పనులు వేగవంతం చేస్తాం
పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్
నెల్లిపాక : కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి , పునరావాసం కల్పిస్తామని పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ (భూసేకరణ) భానుప్రసాద్ స్పష్టం చేశారు. ఎటపాక మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా నాలుగు విలీన మండలాల తహసీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నెల్లిపాకలో నిర్వాసితులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గోదావరి వరదల సమయంలో నెల్లిపాక జలదిగ్బంధంలో ఉంటుందని 90 శాతం భూములు ముంపునకు గురవుతాయని గ్రామస్తులు వివరించారు తమ గ్రామాన్ని కూడా పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఇందుకు భానుప్రసాద్ బదులిస్తూ నాలుగు మండలాల్లో 191 హేబిటేషన్లు ముంపునకు గురవుతున్నట్టు ఇరిగేష¯ŒS శాఖ గుర్తించిందన్నారు. వాటిలో పూర్తిగా, పాక్షికంగా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మొదట గెజిట్‌లో ఉన్న ముంపు గ్రామాల్లో భూసేకరణ సర్వేను వేగవంతం చేయనున్నామని చెప్పారు. మరో 90 గ్రామాలు ముంపు జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కొత్తగా జీఓ విడుదల చేయనుందని ప్రకటించారు. ఎఫ్‌ఆర్‌ఎల్ ప్రకారం బౌండరీ నుంచి 100 మీటర్ల దూరం వరకు భూసేకరణ చేస్తామని చెప్పారు. గిరిజనేతరులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించి గృహాలు నిర్మించి కాలనీల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ముంపునకు గురయ్యే గిరిజనుల రెండున్నర ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని ఇస్తామన్నారు. మిగిలిన భూమికి పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటూ డి పట్టాలు పొందిన రైతులకు కూడా పరిహారం వర్తిస్తుందన్నారు.
నిర్వాసితుల కోసం రూ. 27 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ 36 వేల కోట్లయితే, అందులో 370 ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ 27 వేల కోట్లను పరిహారం, ప్యాకేజి, పునరావాసాలకు ఖర్చవుతుందని అంచనా అని భానుప్రసాద్ తెలిపారు. ఈ జిల్లాలోని నిర్వాసితులు కోరుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పునరావాసం, భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2018 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో మొదటి ఫేజ్‌లో వీఆర్‌పురం మండలంలో 11, కూనవరం మండలంలో ఒక గ్రామంలో సర్వే పనులు ప్రారంభించామని తెలిపారు. సమావేశంలో ఎస్డీసీ ఎల్లారమ్మ, తహసీల్దార్లు చిట్టిబాబు, నర్శింహులు, జీవీఎస్ ప్రసాద్ ఉన్నారు.