కారులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.30 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లను చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రేణిగుంట(చిత్తూరు): కారులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.30 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లను చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ మలైరాజన్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ నంజుండప్ప ఈ ఘటన వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన పరమన్ కారులో రాజమండ్రి నుంచి రూ.30 లక్షల విలువ చేసే 220 కిలోలున్న 100 ప్యాకెట్ల గంజాయిని ఈరోడ్‌కు అక్రమంగా తరలిస్తున్నాడు.
వడమాలపేట ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద కారు ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించారు. వడమాలపేట టోల్ ప్లాజా నుంచి వెనుదిరిగిన కారు మళ్లీ రేణిగుంట వైపు మళ్లింది. గాజులమండ్యం సమీపంలోని ఎస్వీ షుగర్స్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ముళ్ల చెట్లలోకి వెళ్లింది. ఆ సమయంలో ప్రధాన నిందితుడు పరమన్ పరారయ్యాడు. వడమాలపేట ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి, సిబ్బంది డ్రైవర్ మలైరాజన్‌ను పట్టుకున్నారు. తనది మధురై అని, పరారీలో ఉన్న పరమన్, రాజమండ్రికి చెందిన మరి కొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ నంజుండప్ప చెప్పారు.