- సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో విద్యార్థులపై ఖాకీల కర్కశం
- విద్యార్థులపై లాఠీచార్జి, పిడిగుద్దులు
- ఆడ, మగ తేడా లేకుండా అమానవీయంగా వ్యవహరించిన పోలీసులు
- సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో యుద్ధ వాతావరణం
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ శనివారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బూటు కాళ్లతో విద్యార్థుల ముఖంపై తొక్కారు. దొరికినవారిని దొరికినట్టు వెంటబడి లాఠీలతో చావబాదారు. ఆడ, మగ తేడా లేకుండా జుట్టుపట్టుకుని మరీ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనతో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఈ ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం నుంచి క్యాంపు కార్యాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించలేదు. కొందరు విద్యార్థులు హఠాత్తుగా సీఎం క్యాంపు కార్యాలయం సమీపానికి దూసుకువచ్చి నిరసన నినాదాలు అందుకోవడంతో కంగుతిన్న పోలీసు అధికారులు, సిబ్బంది డీసీపీ ఎల్.కాళిదాస్ వెంకట రంగారావు ఆధ్వర్యంలో విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర క్యార్యదర్శి కె.వసంత్‌ను రోడ్డుపై పడదోసినా.. నినాదాలు చేస్తూండటంతో బూటుకాలుతో నుదురుపై తన్నారు.
విద్యను వ్యాపారంగా మార్చొద్దు..
ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రైవేటు విదేశీ యూనివర్సిటీల వల్ల విద్య పూర్తిగా వ్యాపారంగా మారి పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీల వల్ల దుష్ఫలితాలు వస్తున్నాయని గమనించిన సుప్రీంకోర్టు 112 యూనివర్సిటీలను రద్దుచేసిందని గుర్తుచేశారు. ప్రైవేటు యూనివర్సిటీలు రిజర్వేషన్లు పాటించవని, వాటికి అధిక ఫీజులు వచ్చే కోర్సులను మాత్రమే ప్రవేశపెడతాయని అన్నారు.
రాష్ట్రంలో 20 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 5 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని, ప్రభుత్వ యూనివర్సిటీలలో 1164 పైగా అధ్యాపక పోస్టులు, వైస్‌చాన్సలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వటంపై చూపే శ్రద్ధ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ప్రకటించిన వర్సిటీలను సాధించటంపై చూపాలని కోరారు. సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్, నేతలు అశోక్, రాజేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము నాయకులు లక్ష్మణరావు, ప్రవీణ్‌కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.