ప్రమాదానికి గురైన పోలీస్ జీపు
- కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు..చేయి తొలగింపు
- స్వలంగా గాయపడిన ఏఎస్‌ఐ, హోంగార్డు
సత్తుపల్లి : పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్‌జీపును మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వలంగా గాయపడ్డారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం..మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ జీపును గుర్తు తెలియని లారీ సైడ్ నుంచి వేగంగా ఢీకొని వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ ఉమర్ కుడిచేయి నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దలు జీపులో పడ్డాయి. దీంతో జీపు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. జీపులో ఉన్న ఏఎస్సై రాజుకు తలకు గాయమైంది. హోంగార్డు కె.అశోక్ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సీఐ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఉమర్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చేయి తొలగించారు. ఏఎస్సై రాజు, హోంగార్డు అశోక్‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాలకు సమాచారం అందించారు. గాయపడిన ఉమర్ చేయి తొలగించాల్సి రావడంతో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉమర్‌కు వివాద రహితుడిగా మంచిపేరు ఉంది. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా క్రైం కేసుల్లో చురుగ్గా వ్యవహరించి పలు మార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.