విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సొంత భవనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసుకున్న కృష్ణా పుష్కరాల ఫ్లెక్సీలను తొలంగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తప్ప ఎవరికీ అనుమతి లేదని హెచ్చరించారు.
బలవంతంగా ఫ్లెక్సీలు తొలగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలీసులు తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు జోగి రమేష్, నాగిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఫ్లెక్సీల తొలగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడంపై వారు నిరసన తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నామని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది.