పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ‘స్థానికం’ చిక్కులు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియతో రాజధానిలో ఉన్న రెండు కమిషనరేట్లలో ‘లోకల్ ప్రాబ్లమ్స్’ రానున్నాయి. వీటిని సరిచేస్తూ సవరణ ఉత్తర్వులు ఇవ్వకుంటే పోలీసు ఎంపికలో అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. సైబరాబాద్, రాచకొం డ కమిషనరేట్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు వస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభజన ప్రభావం హైదరాబాద్ జిల్లాపై లేకపోవడంతో సిటీ కమిషనరేట్ ‘సేఫ్ జోన్’లో ఉండిపోయింది.
యూనిట్ ఆధారంగా ఎంపికలు...
పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో భౌగోళిక ప్రాంతాన్ని యూని ట్‌గా పరిగణిస్తూ పోలీసు రిక్రూట్‌మెంట్ రూల్స్ రూపొందిం చారు. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. ప్రాథమికంగా కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్‌స్పెక్టర్‌తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు.
గందరగోళంలో రెండు కమిషనరేట్స్...
జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ఉత్తర్వులు సైబరాబాద్‌తో పాటు రాచకొండ కమిషనరేట్‌నూ గందరగోళంలో పడేశాయి. కొత్తగా ఏర్పడనున్న శంషాబాద్ జిల్లాలోకి షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, శేరిలిం గంపల్లి, రాజేంద్రనగర్ వస్తున్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ రాచకొండ కమిషనరేట్‌లో, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రాంతాలు. అలాగే మల్కాజిగిరి జిల్లాలో కి కూకట్‌పల్లి, కుద్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాలు చేరుతున్నాయి. వీటిలో మొదటి రెండూ సైబరాబాద్‌లో, మిగి లినవి రాచకొండలో భాగాలు.
ఇక రాచకొండ కమిషనరేట్‌లో ఉన్న భువనగిరిని యాదాద్రి జిల్లాలోకి చేరుస్తూ అందులోకి వరంగల్, నకిరేకల్, తుంగతుర్తి నుంచి కొన్ని ప్రాంతాలను కలుపుతున్నారు. ఇలా సైబరాబాద్, రాచకొండ క మిషనరేట్ల పరిధిలో భౌగోళికంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాలు వచ్చేలా విభజన ముసాయిదా ఉంది. దీనివల్ల రిక్రూట్‌మెంట్‌లో అనేక న్యాయపరమైనచిక్కులొచ్చే ఆస్కారం కనిపిస్తోంది.
ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిందే...
పోలీసు రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ పోస్టుల దగ్గరకు వచ్చేసరికి ఆయా రెవెన్యూ జిల్లాలనే పరిధిగా ఎంచుకుంటారు. రిక్రూట్‌మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి యూనిట్‌లోనూ కచ్చితంగా 80 శాతం స్థానికుల్ని, 20 శాతానికి మించకుండా స్థానికేతరుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర జిల్లాల్లో విభజన వల్ల ఇబ్బందు లు లేకపోయినా సైబరాబాద్, రాచకొండలకు చిక్కులు వస్తున్నాయి. ఈ రెండింటి పరిధిలోనూ ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉంటున్నాయి.
దీంతో ఇక్కడ జరిగే కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఎవరిని స్థానికులుగా పరిగణించాలి అనేది ప్రశ్నగా మారుతోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా సవరణ ఉత్తర్వులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో సైబరాబాద్, రాచకొండల వరకు పోలీసు జిల్లానే యూనిట్‌గా తీసుకునేలా ఆదేశాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు.