
అంకెల్లో ఘనం.. ఆచరణలో శూన్యం
ఖమ్మం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల్లో ఘనంగా ఉన్నా.. ఆచరణ సాధ్యం కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భక్తరామదాసు, సీతారామ ఎత్తిపోతల పథకాలకు కేవలం రూ. 1,152 కోట్లు మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. చాలీచాలని నిధులతో ఎత్తిపోతల పథకాలు ఏలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
గత రెండుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేరుకు ఘనంగా ప్రకటించినా... వాటిల్లో కేవలం 40 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతుల రుణమాఫీకి సరిపడా నిధులు కేటాయించకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ ముద్ర వేసుకుందన్నారు. పేదవాడు పెద్ద చదువులు చదవాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యకు పెద్ద పీట వేస్తే.. ఈ ప్రభుత్వం రూ. 3,700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నా.. పట్టించుకోవడం లేదన్నారు.