పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: టీచర్ల రేషనలైజేషన్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేసి, ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని, గుర్తింపులేని ప్రేవేటుస్కూళ్లను రద్దుచేయాలని, టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుచేసి క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఉపాధ్యాయుల నియామకం జరపాలని, ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి ఆయన ఒక లేఖ రాశారు. డీఎస్సీ అదిగో... ఇదిగో... అంటూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఊరించి మోసం చేసిందని, తెలంగాణ ఏర్పడి పదినెలలు గడిచినా ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఎటూ తేల్చకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు వస్తాయంటూ 4 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ విద్యా సంవత్సరం ముగిసిందని, వేసవి సెలవులు కూడా వచ్చినా టీచర్ల భర్తీపై ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని విమర్శించారు.