
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోన్న టీఆర్‌ఎస్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కల్లూరు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు వల్లపునేని భాస్కర్‌రావు గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు పంట నష్టపోయారన్నారు.
అలా నష్టపోయిన పత్తి రైతుకు ఎకరానికి రూ. 25 వేలు, వరికి రూ. 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండో పంట వేసుకోని రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ ఏర్పడి కష్టాలు తీరతాయని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ ఏనుగు సత్యంబాబు, నాయకులు కాటమనేని కృష్ణారావు, కుక్కా వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.