- రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నట్టు ప్రకటించిన కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం కల్చరల్: అఖిల భారత వీరశైవ మహాసభ ఆధ్వర్యంలో పది, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనపరచిన అన్ని జిల్లాల్లోని వీర శైవ విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్దనున్న ప్రియదర్శిని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
వీరశైవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎంజీ రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కాపు రామచంద్రారెడ్డి మాట్లాడారు. 2016–17 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 9 పాయింట్లపైన, ఇంటర్‌లో 90 శాతం పైన మార్కులు తెచ్చుకున్న వీరశైవ విద్యార్థుల నుండి ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
ఆసక్తి కలిగిన వారు ఈనెల 25 లోపు ‘అఖిల భారత వీరశైవ మహాసభ, 10–1–33, లక్ష్మీ బజార్, రాయదుర్గం, అనంతపురం జిల్లా, 515865’ చిరునామాకు దరఖాస్తులు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు కాపు రామచంద్రారెడ్డి 9701698777, రాఘవేంద్ర 9880793739 నంబర్లలో సంప్రదించాలన్నారు.