
అస్వస్థతతో గర్భిణి మృతి
మృతురాలు ఉత్తరప్రదేశ్‌వాసి
తాండూరు రూరల్: ఓ గర్భిణి అస్వస్థతకు గురై మృతిచెందింది. గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ర్టం అలహాబాద్‌కు చెందిన రాజేశ్వర్‌కుమార్ కుష్వాహా గతేడాది అదే రాష్ట్రానికి చెందిన విశాఖ(28)ను వివాహం చేసుకున్నాడు. రాజేశ్వర్‌కుమార్ కుష్వాహా దక్షణ మధ్య రైల్వేలోని తాండూరు రైల్వేస్టేషన్‌లో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. దంపతులు మూడు నెలలుగా తాండూరు రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు.
ఇదిలా ఉండగా, విశాఖ ఉన్నత విద్య అభ్యసిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. ఆమె 3 నెలల గర్భవతి. కొన్నినెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండేది. అయితే, కుష్వాహా, విశాఖ దంపతులు ఇటీవల స్వస్థలం అలహాబాద్‌కు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటలకు రైలులో సికింద్రాబాద్‌కు వచ్చారు. రైలు ప్రయాణంలోనే విశాఖ వాంతులు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి రైల్వేశాఖకు చెందిన వాహనంలో అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో వారు తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. విశాఖకు వాంతులు తగ్గలేదు. దంపతులు తమ క్వార్టర్స్‌కు వెళ్లారు. అక్కడ విశాఖ ఒక్కసారిగా కుప్పకులిపోయింది. దీంతో భర్త కుష్వాహా ఆమెను స్థానికుల సహాయంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే విశాఖ చనిపోయిందని నిర్ధాఱించారు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకట్రామయ్య తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తహసీల్దార్ రవీందర్ విశాఖ మృతిపై పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త కుష్వాహాతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే, విశాఖ గుండెపోటుకు గురై మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య మృతితో కుష్వాహా కన్నీటిపర్యంతమయ్యారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.